కామారెడ్డి: కామారెడ్డి మండలం (Kamareddy) క్యాసంపల్లి వద్ద పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ కారులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమవడంతో అందులో ఉన్నవారంతా క్షేమంగా బయటపడ్డారు. శనివారం తెల్లవారుజామున క్యాసంపల్లి శివారులో జాతీయ రహదారిపై స్కార్పియో కారులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే కారును నిలిపి, అందులో ఉన్న వారందరిని అప్రమత్తం చేశారు. దీంతో అంతా కిందికి దిగిపోవడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు. అయితే క్రమంగా మంటలు వ్యాపించడంతో కారు మొత్తం దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్తలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది.
కారు భువనగిరి నుంచి బడాపహడ్కు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ప్రయానిస్తున్నారని, వారంతా సురక్షితంగా ఉన్నారన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నామని తెలిపారు.