భారతదేశ స్వాతంత్య్రానికి, సార్వభౌమత్వానికి ప్రతీక లాంటి ఎర్రకోట నెత్తుటితో తడిసింది. దేశానికి గుండెకాయ లాంటి రాజధాని నగరం ఉగ్రదాడితో వణికిపోయింది. ఢిల్లీలోని హైసెక్యూరిటీ జోన్లో సోమవారం జరిగిన కారుబాంబు పేలుడులో పదమూడు మంది ప్రాణాలు కోల్పోయారు. అధికార సౌధాలకు కూతవేటు దూరంలో ఉగ్రఘాతుకం చోటుచేసుకోవడంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొన్నాళ్లుగా బుసలు కొడుతున్న ఉగ్రవాదం ఇప్పుడు హఠాత్తుగా కాటు వేయడం ఆందోళన కలిగిస్తున్నది. ఫిదాయీన్ తరహాలో జరిగిన ఈ దాడి మూలాలు కశ్మీర్లో ఉన్నట్టు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తున్నది. కుట్రదారుల్లో ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ పేరు ప్రముఖంగా వినవస్తున్నది.
ఎవరు బాధ్యులనేది దర్యాప్తులో తేలవచ్చు. కానీ, పౌరుల భద్రత మాత్రం డోలాయమానంలో పడిందన్నది వాస్తవం. ఉగ్రదాడుల నుంచి కూడా ఎన్నికల లబ్ధి పొందాలని చూసే బీజేపీ ప్రభుత్వం ఉగ్రదాడిని అరికట్టడంలో పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా నిఘా వ్యవస్థల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఇటీవలే హర్యానా, యూపీ, కశ్మీర్లో టెర్రర్ మాడ్యూల్స్ బయటపడ్డాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్‌ను ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై గుజరాత్లో అరెస్టు చేశారు. వేర్వేరు చోట్ల భద్రతా దళాల దాడుల్లో భారీఎత్తున పేలుడు పదార్థాలు, ఆయుధాలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో జరిగిన ఢిల్లీ పేలుడు ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ (కేంద్రం, ఢిల్లీ, మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు బీజేపీ చేతుల్లోనే ఉన్నాయి) పర్యవేక్షణలో జరిగిన ఘోర నిఘా వైఫల్యాన్ని ఎత్తిచూపుతున్నది.
దేశ రాజధానిలో ఉగ్రదాడి జరగడం ఇదే ప్రథమం కాదు. 2001లో ఏకంగా పార్లమెంటుపైనే దాడి జరిగింది. ఎర్రకోట పరిసరాల్లోనూ ఉగ్రవాద చర్యలు జరిగాయి. కాంగ్రెస్ హయాంలో దాడులు జరిగినప్పుడు తాము అధికారంలోకి వస్తే ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని బీజేపీ చెప్పుకునేది. కానీ, నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరాక 11 ఏండ్లలో 68 ఉగ్రదాడులు జరిగాయి. 600 మందికి పైగా సైనికులు, పౌరులు ఆ దాడుల్లో మరణించారు. కాంగ్రెస్ పాలనలో పౌరులు ఎక్కువగా మరణిస్తే, బీజేపీ పాలనలో సైనికులు ఎక్కువ సంఖ్యలో ప్రాణాలు కోల్పోతుండటం గమనార్హం. పుల్వామా దాడిలో 40 మంది సైనికులు అమరులు కావడానికి నిఘా, భద్రతా నిర్వహణ లోపాలే కారణమనే విమర్శలు వచ్చాయి. గత ఏప్రిల్‌లో పహల్గాంలో జరిగిన భారీ ఉగ్రదాడిలో 26 మంది సాధారణ పౌరులు బలయ్యారు. ఆ దరిమిలా మోదీ సర్కార్ పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టి ఉగ్రవాద స్థావరాలను తుడిచిపెట్టినట్టు చెప్పుకున్నది. కానీ, తాజాగా ఢిల్లీలో జరిగిన కారుబాంబు పేలుడు ఈ లక్ష్యసాధన సంపూర్ణంగా సాధ్యం కాలేదనే సందేహాలకు తావిస్తున్నది.
విపక్షాలపై నిరంతరం నిఘా పెట్టే సర్కార్.. ఉగ్రసంస్థల కదలికలను పసిగట్టి, దాడులను నివారించడంలో ఎందుకు విఫలమవుతున్నది? చిత్తశుద్ధి, ఆపై కార్యసిద్ధి లోపించడమే ఇందుకు కారణమని చెప్పక తప్పదు. దాడి జరిగిన తర్వాత హంగామా చేయడం కాదు, సమస్యకు మూలకారణాలను వెతకడంపై దృష్టిపెట్టాల్సి ఉంది. ఇప్పటివరకు విద్యకు దూరమై, అభివృద్ధికి నోచుకోని వర్గాల నుంచి ఉగ్రవాదులు ఎక్కువగా పుట్టుకొచ్చేవారు. కానీ, ఇప్పుడు విద్యాధిక వర్గం నుంచి కూడా ఉగ్రవాదులు తయారుకావడం తీవ్ర ఆందోళనకరమైన విషయమనే చెప్పాలి. కశ్మీర్ ప్రజల్లో వివక్షకు గురవుతున్నామనే భావన ఉగ్రవాదానికి కొంతవరకు ఊతమిస్తున్నది.
ఆర్టికల్ 370ని తొలగించి జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని రద్దు చేసిన బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర హోదాను కూడా లేకుండా చేయడం వంటి చర్యలు అక్కడి ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీశాయనడంలో సందేహం లేదు. కనుక ప్రజల ఆకాంక్షలను గుర్తించి వాటిని నెరవేర్చేందుకు చర్యలు చేపట్టాల్సి ఉంది. ఓ వైపు వారి విశ్వాసాన్ని చూరగొనేందుకు కృషి చేస్తూనే, మరోవైపు ఉగ్రవాదం అంతానికి వ్యూహాత్మకంగా ముందుకు సాగాల్సి ఉన్నది. కానీ, విద్వేష రాజకీయాలకు, రహస్య ఎజెండాలకు పుట్టిల్లు అయిన బీజేపీ ఆ దిశగా అడుగులు వేస్తుందా? సందేహమే.