బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు స్టే ఇవ్వకపోతే సుప్రీంకోర్టుకు వస్తారా? ఆ ఆంశంపై హైకోర్టులో విచారణ పూర్తి కాకుండానే మేం విచారణ చేపట్టలేం.ఈ విషయంలో మీరు కింది కోర్టుకే వెళ్లండి.
హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న క్రమం లో తాము ఇప్పుడు విచారణ చేపట్టలేమని సుప్రీంకోర్టు పేర్కొన్నది. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ వంగ గోపాల్‌రెడ్డి తదితరులు దాఖ లు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టులో జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా బెంచ్ సోమవారం విచారణకు స్వీకరించింది. ఆర్టికల్ 32 కింద 6వ పేజీలో సుప్రీంకోర్టులో పిటిషన్ ఎందుకు వేశారని న్యాయమూర్తి అడిగారు.
ఇప్పటికే ఈ అంశంపై రెండు పిటిషన్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని రాష్ట్ర ప్ర భుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్ దవే, అభిషేక్ సింఘ్వీ న్యాయస్థానం దృష్టికి తేగా హైకోర్టులో విచారణ పూర్తి కాకుండానే తాము సుప్రీంకోర్టులో విచారణ చేపట్టలేమని పేర్కొన్నారు. హైకోర్టు స్టే ఇవ్వకపోవడంతో తాము సుప్రీంకోర్టుకు వచ్చామని పిటిషనర్లు చెప్పారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ హైకోర్టు స్టే ఇవ్వకపోతే సుప్రీం కోర్టుకు వస్తారా? అని ప్రశ్నించారు. ఆర్టికల్ 32 కింద దాఖలైన పిటిషన్‌పై తాము జోక్యం చేసుకోలేమని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకుంటున్నట్టు పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలుపగా పిటిషన్ విత్‌డ్రాకు కోర్టు అనుమతించింది.