Group 1 Mains | హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): కోర్టులో ఉన్న కేసుల కారణంగా టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ రాసిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఆయా కేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే మెయిన్స్ పరీక్షలను మరోసారి నిర్వహిస్తారన్న ప్రచారం జరుగుతున్నది. మరోసారి మెయిన్స్ రాసే ఓపిక లేదని, మళ్లీ పరీక్ష జరపకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ పలువురు అభ్యర్థులు కమిషన్ చైర్మన్‌కు గురువారం వినతిపత్రం సమర్పించారు. దాదాపు మూడేండ్లపాటు కష్టపడి చివరికి గత నెలలో మెయిన్స్ పరీక్ష రాశామని పేర్కొన్నారు.
ఈ సమయంలో తమ విలువైన కాలాన్ని వెచ్చించామని, ఇప్పుడు జీవనోపాధిపై దృష్టి పెట్టామని తెలిపారు. ఇలాంటి సమయంలో మరోసారి పరీక్ష రాయాలంటే తమ వల్ల కాదని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే తీర్పు తర్వాత మెయిన్స్‌కు అర్హత సాధించే వారికి మాత్రమే ప్రత్యేకంగా పరీక్ష పెట్టాలని, నార్మలైజేషన్ వంటి ప్రక్రియ ద్వారా అందరికీ న్యాయం చేయాలని కోరారు.