హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గ్రూప్-1 ఫలితాల విడుదలకు మరోసారి బ్రేకులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సుదీర్ఘ న్యాయపోరాటం చేస్తున్న అభ్యర్థులు.. తాజాగా మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జీవో-29ని సవాల్ చేస్తూ వికలాంగుల కోటా రోస్టర్‌ను మార్చాలన్న డిమాండ్‌తో ఇటీవల సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేశారు. ఒకట్రెండు రోజుల్లో ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశమున్నది. గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఇది నాలుగోసారి. దీంతో అప్రమత్తమైన టీజీపీఎస్సీ.. తమ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీచేయరాదని కోరుతూ సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనం ఇప్పటికే పూర్తవడంతో ఈ నెలలోనే జనరల్ ర్యాంకింగ్ లిస్టు (జీఆర్ఎల్) విడుదల చేయాలని టీజీపీఎస్సీ భావిస్తున్నది. ఈ తరుణంలో అభ్యర్థులు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.
సీటెట్ ఫలితాల విడుదల
హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : సెంట్రల్ ఎలిజిబిలిటి టెస్ట్ డిసెంబర్ 2024 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. డిసెంబర్లో నిర్వహించిన పరీక్షల ఫలితాలను సీబీఎస్ఈ శుక్రవారం విడుదల చేసింది. పేపర్-1లో 24.17 శాతం, పేపర్-2లో 12.31శాతం అభ్యర్థులు మాత్రమే క్వాలిఫై అయ్యారు.