ఆదిలాబాద్, మార్చి 11(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కజ్జర్లలో భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు ఉన్నా నీరు పోయకపోవడంతో వందల ఎకరాల్లో జొన్న పంట ఎండిపోయే ప్రమాదం నెలకొన్నది. చెరువులో నీరు పుష్కలంగా ఉంది. కానీ కాలువకు గండి పడడం, మట్టి, గడ్డి, పిచ్చిమొక్కలు మొలవడంతో నీరు పారే పరిస్థితి లేదు. కాలువకు మరమ్మతులు చేయాలని అధికారులను వేడుకున్నా స్పందన కరువైంది. దీంతో చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు అన్నదాతలే స్వయంగా సోమవారం కాలువ మరమ్మతు పనులు చేపట్టారు. తలా కొంత డబ్బులు జమ చేసుకుని కాలువ గండిని పూడ్చి వేయడంతోపాటు జేసీబీ ద్వారా మట్టి, పిచ్చి మొక్కలు తొలగించారు. కాలువల్లోకి నీరు పారింది. వంద ఎకరాల జొన్న పంటకు సాగు నీరందింది.