మహబూబ్ నగర్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ( BRS ) అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud) ధీమాను వ్యక్తం చేశారు. బుధవారం మహబూబ్ నగర్ పార్టీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మహబూబ్ నగర్, హన్వాడ మండల బీఆర్ఎస్ సర్పంచుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సిన రూ. 3,500 కోట్ల నిధుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసి, రిజర్వేషన్లను 24 శాతం నుంచి 17 శాతానికి తగ్గించి హడావుడిగా ఎన్నికలు జరిపిందని ఆరోపించారు. ఫైనాన్స్ కమిషన్ నిధుల్లో 70 శాతం నేరుగా గ్రామ పంచాయతీలకే రావాలన్నారు. ఆ నిధులను ఆపే హక్కు ఎమ్మెల్యే, నాయకుడికిని లేదని చెప్పారు. సర్పంచ్ లకు సహాయం చేసేందుకు లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

రైతులు యూరియా కోసం చెప్పులను లైన్లలో పెట్టడం వల్ల ప్రభుత్వం పరువు పోతుందని ముఖ్యమంత్రి తెలివిగా ‘యూరియా యాప్’ తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు. షాపులో దొరకని యూరియా యాప్లో దొరుకుతుందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఇంకో రెండేళ్లే. మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. మీరు ఐదేళ్ల కోసం గెలిచారు, మిగిలిన సగం కాలం మన ప్రభుత్వంలోనే అభివృద్ధి పనులు చేసుకుంటారని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజలకు వివరించాలని కోరారు.
గ్రామాల్లో పార్టీ బలంగా ఉంది : ఆల వెంకటేశ్వర్ రెడ్డి
రానున్న ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్ గెలుస్తుందని ఆల వేంకటేశ్వర్ రెడ్డి అన్నారు. పార్టీకి పట్టుకొమ్మలైన నాయకులు, కార్యకర్తలకు రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటదని వెల్లడించారు. పాలమూరు ప్రాజెక్ట్ కోసం కేసీఆర్ సమావేశం పెట్టి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నారని వివరించారు.
ఈ సమావేశంలో గ్రంథాలయ సంస్ధ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, హన్వాడ మాజీ ఎంపీపీ బాలరాజు, మాజీ జడ్పీటీసీ నరేందర్, మహాబూబ్ నగర్ మండల పార్టీ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, పార్టీ హన్వాడ మండల అధ్యక్షులు కరుణాకర్ గౌడ్, పట్టణ పార్టీ అధ్యక్షులు శివరాజ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, రహమాన్ సీనియర్ నాయకులు కొండ లక్ష్మయ్య, శ్రీనివాసులు, చెన్నయ్య, అల్లావుద్దీన్, అన్వార్ తదితరులు పాల్గొన్నారు.