హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ) : ఆదివారం సాయంత్రానికి గడువు ముగిసినా సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నదని బీఆర్ఎస్ తెలిపింది. ఈ మేరకు సీఈవో వికాస్‌రాజ్‌కు బీఆర్ఎస్ లీగల్ సెల్ నాయకురాలు ఎన్ లలితారెడ్డి, పార్టీ నేతలు లక్ష్మణ్, సదానందం కలిసి ఫిర్యాదు చేశారు. ఎక్స్ వేదికగా ప్రచారం చేస్తున్నదని, ఇందుకు సంబంధించిన ఆధారాలను అందజేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేయాలని, పోస్టర్లు, ఫొటోలతో విజ్ఞప్తి చేస్తున్నారని తెలిపారు. లైవ్ టెలికాస్ట్ కూడా నిర్వహిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల నియామవళిని స్పష్టంగా ఉల్లంఘించారని, దీనికి బాధ్యులైన కాంగ్రెస్ పార్టీపై చర్యలు తీసుకోవాలని కోరారు. దేవరకొండ నియోజకవర్గం, హుజూర్నగర్ నియోజకవర్గంలోని కొన్ని పోలింగ్ స్టేషన్లలో కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడాలని, ఓటర్లను బెదిరించాలని చూస్తున్నారని తమకు సమాచారం అందిందని మరో ఫిర్యాదు చేశారు. ఈ నియోజకవర్గాల్లో పోలీసులను ఎక్కువ మందిని మోహరించి ఎలాంటి రిగ్గింగ్, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్టు లీగల్ సెల్ నాయకురాలు లలితా రెడ్డి మీడియాకు తెలిపారు.