Telangana | హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): సచివాలంయలోని ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఐదో అంతస్తుకు మార్చనున్నట్టు ప్రచారం జరుగుతున్నది. సీఎం రేవంత్రెడ్డి చాంబర్, సీఎంవో ముఖ్యకార్యదర్శి, సలహాదారులు ఆరో అంతస్తులోనే కొనసాగుతారని, ఇతర కార్యదర్శుల పేషీలు ఐదో అంతస్తుకు తరలిస్తారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఐదో అంతస్తులో వారం రోజుల్లో పనులు మొదలు కానున్నట్టు చెప్పుకుంటున్నారు. మరోవైపు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల్లో ఆదరణ తగ్గిపోవడం, రోజూ ఏదో ఒకచోట, ఎవరో ఒకరు ధర్నాలు, నిరసనలతో రాష్ట్రం అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో వాస్తు మార్పుల్లో భాగంగా ఐదో అంతస్తుకు కార్యాలయాల తరలింపు తెరమీదికి వచ్చిందనే వాదనలు ఉన్నాయి. ఇప్పటికే ఆరో అంతస్తులోని సీఎం కార్యాలయంలో వాస్తు మార్పు ఆగమేఘాల మీద జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన సచివాలయంలోకి వచ్చి పోయే మార్గాల్లో మార్పులు చేశారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఆరో నంబర్ అచ్చిరాలేదని ప్రభుత్వ పెద్దలు అనుకుంటున్నట్టు తెలిసింది. ప్రభుత్వ పాలనాపరమైన కార్యాలయాలను ఐదో అంతస్తులోకి తరలించాలని భావిస్తున్నట్టు పేర్కొంటున్నాయి.