హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కార్మికవర్గం అంతా సీఎం కేసీఆర్ వెంటే ఉన్నదని బీఆర్ఎస్కేవీ అధ్యక్షుడు రాంబాబుయాదవ్, నేతలు రూప్సింగ్, వేముల మారయ్య చెప్పారు. కార్మికవర్గ పక్షపాతి కనుకే సీఎం కేసీఆర్ ‘ఇంటింటికీ ధీమా-కేసీఆర్ బీమా’ పథకాన్ని బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించారని తెలిపారు. బుధవారం తెలంగాణభవన్‌లో వారు మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రవ్యాప్తంగా బీడీ, భవన నిర్మాణ, హమాలీ తదితర అసంఘటిత రంగ కార్మికులు కోటి మంది ఉంటారని, ఆ కుటుంబాల్లో కొత్తకాంతులు నింపేందుకు సీఎం కేసీఆర్ తేనున్న బీమా పథకంపై కార్మికవర్గంలో విస్తృత ప్రచారాన్ని చేపడతామని వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వలే కార్మికవర్గ ప్రయోజన కార్యక్రమాలు చేపట్టలేదని పేర్కొన్నారు. ‘ఇంటింటికీ ధీమా-కేసీఆర్ బీమా’ దేశంలోని అసంఘటిత కార్మికలోక కల్యాణానికి మేలిమలుపు కాబోతున్నదని చెప్పారు. సమావేశంలో శివశంకర్, దాన కిశోర్, శ్రీనివాస్, నిర్మలారెడ్డి తదితరులు పాల్గొన్నారు.