మోర్తాడ్/వేల్పూర్, ఏప్రిల్ 7: అరవై ఏండ్ల పాటు ఆంధ్ర పాలకుల కబంధ హస్తాల్లో నలిగిన తెలంగాణకు విముక్తి కల్పించింది కేసీఆరేనని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. స్వరాష్ట్రం కోసం ఆనాడు పదవులను త్యజించి ఒంటరిగా బయల్దేరి, రానే రాదన్న తెలంగాణను సాధించిన చూపిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని తెలిపారు. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా వరంగల్ ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే ఆవిర్భావ సభకు బాల్కొండ నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు. సోమవారం నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో వేముల మాట్లాడారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలంటే రాష్ట్ర ఏర్పాటే సరైన పరిష్కారమని నమ్మి, రాష్ట్రసాధనే లక్ష్యంగా అన్ని పదవులకు రాజీనామా చేసిన వ్యక్తి కేసీఆర్ అని వేముల గుర్తు చేశారు. 2001లో పార్టీ స్థాపించి 14 ఏండ్లుగా శాంతియుతంగా ఉద్యమాన్ని ముందుండి నడిపించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అన్నారు. తెలంగాణను అనేక రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. బీఆర్ఎస్ను విమర్శిస్తున్నవారికి సమాధానం చెప్పడానికి వరంగల్ సభ వేదిక కానున్నదని చెప్పారు.