హైదరాబాద్ సిటీబ్యూరో/చిక్కడపల్లి, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య హెచ్చరించారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోవాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాగ్‌లింగంపల్లి బీఆర్టీయూ కార్యాలయంలో ‘కాంగ్రెస్ మోసపూరిత హామీలు-ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలు’ అంశంపై ఆటో జేఏసీ నాయకుల సమావేశం గురువారం జరిగింది.
ఈ సందర్భంగా మారయ్య మాట్లాడుతూ.. ఇంకెంతమంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం స్పందిస్తుందో సీఎం చెప్పాలని ప్రశ్నించారు. ఇక సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అక్టోబర్ 22న చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చినట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లతో ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా చేపట్టనున్నట్టు చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 50 మందికి పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తుచేశారు.
ఏఐటీయూసీ నాయకుడు వెంకటేశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఆటో డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీయే ఇందుకు కారణమని మండిపడ్డారు. సీఐటీయూ నాయకుడు పుప్పాల శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఉపాధి లేక, కుటుంబాన్ని పోషించలేక ఆటోడ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వాపోయారు.
ఐఎఫ్టీయూ నాయకుడు ప్రవీణ్ మాట్లాడుతూ.. అక్టోబర్ 22న జరిగే చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూటీఏడీడబ్ల్యూ సలీం, ఆటో ఓనర్స్ అసోసియేషన్ నాయకుడు రఫత్, రమేశ్, రామకృష్ణ, చంద్రమౌళి, ఏటీసీ నాయకులు అశోక్ జంగయ్య, అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు.