మహబూబ్‌నగర్: ఎస్ఎల్బీసీ సొరంగం (SLBC Tunnel) లోపల చిక్కుకున్నవారి జాడ గుర్తించేందుకు 14వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వివిధ రెస్క్యూ బృందాలను నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంటకు రప్పించి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్‌ను రంగంలోకి దించారు. శుక్రవారం ఉదయం 7.15 గంటలకు క్యాడవర్ డాగ్స్ బృందం టన్నెల్లోకి వెళ్లింది. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలతోపాటు తవ్వేందుకు అవసరమైన అన్ని సామాగ్రితో 110 మందిని సొరంగంలోకి లోకో మోటర్ తీసుకెళ్లింది. వారితోపాటు డోగ్రా రెజిమెంట్ ఆర్మీ కమాండెంట్ పరీక్షిత్ మెహ్రా, ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ డాక్టర్ హర్షిత్ బెల్జియం కూడా వెళ్లారు. కాగా, మ్యాల్నోయిస్ బ్రీడ్‌కు చెందిన క్యాడవర్ డాగ్స్ 15 ఫీట్ల లోపల ఉన్నా మనుషుల జాగను గుర్తించగలవు. అన్వేషణ అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు టన్నెల్ నుంచి బయటకు రానున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోశ్ బాదావత్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు కేరళకు చెందిన క్యాడవర్ డాగ్స్‌ను ఆర్మీకి చెందిన ప్రత్యేక హెలికాప్టర్లో గురువారం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. డాగ్స్ వెంబడి ప్రత్యేక బృందం కూడా ఎస్ఎల్బీసీ వద్దకు చేరుకున్నది. క్యాడవర్ డాగ్స్ సాయంతో ఏ ప్రాంతంలో పరిశోధనలు జరపాలనే విషయమై సమీక్షించారు. మానవుల ఆనవాళ్లను పసిగట్టడంలో దిట్ట అయిన ఈ డాగ్స్ భూగర్భం లోతుల్లో చిక్కుకున్న వారిని కూడా గుర్తిస్తాయని వారు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జీపీఆర్ ద్వారా చేపట్టిన స్కాన్‌లో గుర్తించిన స్పాట్లను తవ్వగా అక్కడ మిషనరీ బయటపడటంతో ఈ ప్రక్రియ విఫలమైంది. దీంతో నిపుణుల సూచన మేరకు ఈ డాగ్స్‌ను రంగంలోకి దించారు. కాగా, ఇదివరకే స్నిఫర్ డాగ్స్‌ను లోపలికి పంపించినా ఫలితం కనిపించలేదు.
15 అడుగుల లోతుల్లోనూ..
మృతుల అన్వేషణలో క్యాడవర్ జాగిలాలు భేష్క్యాడవర్ డాగ్స్ మానవ అవశేషాలను గుర్తించడానికి ప్రధానంగా శిక్షణ పొందా యి. శోధన, రక్షణ విభాగాల జాగిలాల మాదిరిగా కాకుండా క్యాడవర్ డాగ్స్ విభిన్నమైన పాత్రను పోషిస్తాయి. గల్లంతైన మనుషులు, మృతదేహాలను గుర్తించడంలో వీటికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. 15 అడుగుల లోతులో పాతిపెట్టిన, కుళ్లిపోయిన శరీర భాగాలు, అస్థిపంజర అవశేషాలను కూడా ఇవి గుర్తించగలవు. గాలి, భూమి లోపలి నుంచి వచ్చే వాసనలను ఇవి పసిగట్టగలవు. నీటి అడుగున ఉన్న మృతదేహాలు, మృతుల శరీర భాగాలనూ పసిగడతాయి. గుర్తుతెలియని మృతదేహలతో మిస్టరీగా మారిన నేరాలను పరిష్కరించడానికి క్యాడవర్ డాగ్స్‌పై పోలీస్ యంత్రాంగం ఆధారపడుతున్నది. ప్రస్తుతం ఎస్ఎల్బీసీ సొరంగం రెస్క్యూ ఆపరేషన్‌లో వీటి సేవలను వినియోగించడం చర్చనీయాంశంగా మారింది.