SLBC Tunnel Collapse | మహబూబ్‌నగర్, మార్చి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం జరిగి రెండు వారాలైనా లోపల చిక్కుకున్న కార్మికుల జాడ ఇప్పటివరకు తెలియలేదు. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వివిధ రెస్క్యూ బృందాలను నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంటకు రప్పించి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ సొరంగంలో ప్రతికూల పరిస్థితులు బృందాలకు ఆటంకంగా మారాయి. లోపల ఏం జరుగుతుందో.. ఎప్పుడు, ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితుల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. ప్రాణాలకు తెగించి సొరంగం లోపలికి వెళ్లి కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ బృందాలు చేపడుతున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. మరోవైపు కార్మికుల ఆచూకీపై రోజురోజుకు ఆశలు సన్నగిల్లుతున్నాయి. గురువారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందం దోమలపెంటకు వచ్చింది. టన్నెల్ లోపల చిక్కుకున్న వారిని గుర్తించేందుకు కేరళ నుంచి ప్రత్యేకంగా క్యాడవర్ డాగ్స్‌ను రప్పించారు. చెన్నైకి చెందిన ఐఐటీ నిపుణులు, సింగరేణి సాంకేతిక నిపుణులు, సైనికాధికారులు, ఎన్డీఆర్ఎఫ్, ఇతర అధికారులు సమీక్ష నిర్వహిం చి సొరంగం లోపల తాజా పరిస్థితిని అంచనా వేశారు. మొరాయించిన కన్వేయర్ బెల్టు పనిచేయడం ప్రారంభించడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. మట్టి, ఉబికి వస్తున్న నీటిని బయటకు పంపిస్తున్నారు.
ప్రత్యేక హెలికాప్టర్లో క్యాడవర్ డాగ్స్
ఈ ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు కేరళకు చెందిన క్యాడవర్ డాగ్స్‌ను ఆర్మీకి చెందిన ప్రత్యేక హెలికాప్టర్లో తీసుకువచ్చారు. ఈ డాగ్స్ వెంబడి ప్రత్యేక బృందం కూడా ఎస్ఎల్బీసీ వద్దకు చేరుకున్నది. క్యాడవర్ డాగ్స్ సాయంతో ఏ ప్రాంతంలో పరిశోధనలు జరపాలనే విషయమై సమీక్షించారు. శుక్రవారం ఉదయాన్నే వాటిని స్కాడ్‌తో పాటు లోపలికి తీసుకెళ్తారు. మానవుల ఆనవాళ్లను పసిగట్టడంలో దిట్ట అయిన ఈ డాగ్స్ భూగర్భం లోతుల్లో చిక్కుకున్న వారిని కూడా గుర్తిస్తాయని వారు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జీపీఆర్ ద్వారా చేపట్టిన స్కాన్‌లో గుర్తించిన స్పాట్లను తవ్వగా అక్కడ మిషనరీ బయటపడటంతో ఈ ప్రక్రియ విఫలమైంది. దీంతో నిపుణుల సూచన మేరకు ఈ డాగ్స్‌ను రంగంలోకి దించారు. కాగా, ఇదివరకే స్నిఫర్ డాగ్స్‌ను లోపలికి పంపించినా ఫలితం కనిపించలేదు. బృందాలు మోకాలి లోతు బురదలో పనిచేయాల్సి వస్తున్నది. ఎట్టకేలకు 13 రోజులపాటు కష్టపడి ఒకటి నుంచి రెండు మీటర్లు బురదను బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. లోపలి నుంచి ఊబికి వస్తున్న నీరు, బురద సహాయక చర్యలకు ఆటంకంగా మారుతున్నాయి. మరోవైపు టీబీఎం మిషన్ భాగాలు కూడా చెల్లాచెదురుగా పడిపోయి, బురదలో కూరుకుపోయాయి. అగ్నిమాపక సిబ్బంది వాడే వాటర్ పైపులను ఉపయోగించి మిషనరీపై ఉన్న బురదను తొలగించే ప్రయత్నం చేసినా ఫలితం ఉండటంలేదు.
కేంద్ర హోంమంత్రిత్వ బృందం పరిశీలన
టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బృందం పరిశీలించింది. మినిస్ట్రీ ఫర్ హోమ్ అఫైర్స్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సెక్రటరీ కల్నల్ కీర్తి ప్రతాప్‌సింగ్ స్వయంగా పర్యవేక్షించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందానికి రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి అరవింద్‌కుమార్ టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలను వివరించారు. రెస్క్యూ ఆపరేషన్‌పై సమీక్ష నిర్వహిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బదావత్ సంతోశ్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, డోగ్ర రెజిమెంట్ కమాండెంట్ పరిక్షిత్ మెహ్రా, ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ ప్రసన్న, జయప్రకాశ్ అసోసియేట్ ఎండీ పంకజ్గౌర్ పాల్గొన్నారు.
15 అడుగుల లోతుల్లోనూ పసిగడతాయి!
మృతుల అన్వేషణలో క్యాడవర్ జాగిలాలు భేష్క్యాడవర్ డాగ్స్ మానవ అవశేషాలను గుర్తించడానికి ప్రధానంగా శిక్షణ పొందా యి. శోధన, రక్షణ విభాగాల జాగిలాల మాదిరిగా కాకుండా క్యాడవర్ డాగ్స్ విభిన్నమైన పాత్రను పోషిస్తాయి. గల్లంతైన మనుషులు, మృతదేహాలను గుర్తించడంలో వీటికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. 15 అడుగుల లోతులో పాతిపెట్టిన, కుళ్లిపోయిన శరీర భాగాలు, అస్థిపంజర అవశేషాలను కూడా ఇవి గుర్తించగలవు. గాలి, భూమి లోపలి నుంచి వచ్చే వాసనలను ఇవి పసిగట్టగలవు. నీటి అడుగున ఉన్న మృతదేహాలు, మృతుల శరీర భాగాలనూ పసిగడతాయి. గుర్తుతెలియని మృతదేహలతో మిస్టరీగా మారిన నేరాలను పరిష్కరించడానికి క్యాడవర్ డాగ్స్‌పై పోలీస్ యంత్రాంగం ఆధారపడుతున్నది. ప్రస్తుతం ఎస్ఎల్బీసీ సొరంగం రెస్క్యూ ఆపరేషన్‌లో వీటి సేవలను వినియోగించడం చర్చనీయాంశంగా మారింది.