హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయుల కేటాయింపునకు జారీచేసిన జీవో-317 సమీక్ష కోసం ప్రభుత్వం నియమించి క్యాబినెట్ సబ్‌కమిటీ తన నివేదికను ఆదివారం ప్రభుత్వానికి సమర్పించింది. ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు సీల్డ్కవర్లో ఆ నివేదిను అందజేశారు. వైద్యారోగ్యశాఖ మంత్రి రాజనర్సింహ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతోపాటు మేధావులతో చర్చించింది. ప్రత్యక్షంగా, ఆన్లైన్లో కమిటీ పిటిషన్లను స్వీకరించింది. పలు సమీక్షలు నిర్వహించింది. ముఖ్యంగా 13 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారితో చర్చించింది. పరస్పర బదిలీలకు అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా ఉద్యోగులు కోరారు. నివేదిక సమర్పణలో జాప్యాన్ని నిరసిస్తూ జీవో-317 బాధితులు ఇటీవల గాంధీభవన్‌ను ముట్టడించారు. ఈ నేపథ్యంలోనే మంత్రులు వారితో సంప్రదింపులు జరిపారు.
హైదరాబాద్, అక్టోబర్ 20(నమస్తే తెలంగాణ): ప్రభుత్వం పంతాలు, పట్టింపులకు పోకుండా వెంటనే జీవో 29ని ఉపసంహరించుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ జీవో రాజ్యాంగ స్ఫూర్తికి, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు విరుద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాసినట్టు తెలిపారు. సోమవారమే పరీక్షలని తెలిసి ఆందోళన చేస్తున్న నిరుద్యోగుల ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరారు. 563 గ్రూప్-1 పోస్టులకు రిజర్వేషన్లు పాటించకుండా 1:50 చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేయడం సరికాదని పేర్కొన్నారు. ప్రభుత్వం మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని కోరారు.