హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): ఎస్సీ వర్గీకరణపై స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటుచేయాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు చేసింది. అమలులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని, యుద్ధప్రాతిపదికన బీసీ కులగణన చేపట్టి ఓటర్ల లెక్క తేల్చాలని తీర్మానించింది.
వెంటనే కార్యాచరణ రూపొందించాలని నిర్దేశించింది. సచివాలయంలో మంగళవారం చైర్మన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉపసంఘం నాలుగోసా రి సమావేశమైంది. వైస్ చైర్మన్, మంత్రి దామోదర, సభ్యులుగా ఉన్న మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం, సీతక్క, సీఎస్ శాంతికుమారి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, లా సెక్రటరీ తిరుపతి హాజరయ్యారు. ఇతర రాష్ట్రాల్లో వర్గీకరణ అమలుతీరుపై చర్చించారు. గతంలో ఎస్సీలను 4 గ్రూపులుగా విభజించి రిజర్వేషన్లను అమలుచేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గా ఏర్పడిన తర్వాత ఎస్సీ జనాభాలో మా ర్పులు వచ్చి ఉంటాయని సభ్యులు అభిప్రాయపడ్డారు. గతంలో మాదిరిగా 4 గ్రూపులుగా విభజించి రిజర్వేషన్లు వర్తింపజేయా లా? లేదంటే తమిళనాడు, పంజాబ్ తరహా లో రెండు గ్రూపులుగా విభజిస్తే ఎలా ఉం టుంది? న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయా? అనే విషయంపై చర్చించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటికే అధికారుల బృందం తమిళనాడు, పంజాబ్‌లో పర్యటించి ఎస్సీ వర్గీకరణ అమ లుపై అధ్యయనం చేసిందని తెలిపారు. ప్ర భుత్వానికి నివేదించిందని వెల్లడించారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఉపకులాల వర్గీకరణ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించామని చెప్పారు.
విద్య, ఉద్యోగ నియామకాలతో సహా సమగ్ర సమాచారంతో నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాభిప్రాయ సేకరణకు త్వరలో జిల్లాల్లో పర్యటించనున్నట్టు వెల్లడించారు. నిర్దేశిత కాలపరిమితిలో వర్గీకరణపై అధ్యయనాన్ని పూర్తిచేయాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. బీసీ కుల గణనకు కూడా అన్ని ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు. సమావేశంలో రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.