హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్‌లో నూతన మా డ్యూల్స్ జోడించే కసరత్తు వేగవంతమైంది. అతి త్వరలో ఏడెనిమిది కొత్త మాడ్యూల్స్ అందుబాటులోకి వస్తాయని, వీటి ద్వారా దాదాపు 20 సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అధికారులు తెలిపారు. వ్యవసా య భూముల సమస్యలు, ధరణిలో మా ర్పులు, చేర్పులపై ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ ఇప్పటికే రెండుసార్లు సమావేశమై రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ధరణిలో చేయాల్సిన మార్పులపై చర్చించింది. ప్రధానంగా 20 సమస్యలు ఉప సంఘం దృష్టికి వచ్చినట్టు తెలిసింది. ముందుగా వీటిని పరిష్కరించాలని అధికారులను కమిటీ ఆదేశించినట్టు సమాచారం. అధికారులు ఆయా సమస్యలను ఎలా పరిష్కరించవచ్చో చర్చించి, మాడ్యూల్స్‌ను సిద్ధంచేసి సబ్ కమిటీ ముందు ఉంచారు. మా డ్యూల్స్ను పరిశీలించిన అనంతరం అనుమతి రాగానే పోర్టల్‌లో అప్లోడ్ చేయనున్నట్టు సమాచారం. పేర్లలో తప్పులు, జాయింట్ డాక్యుమెంట్స్, సర్టిఫైడ్ కాపీ వంటి సమస్యలకు ఈ మాడ్యూల్స్ పరిష్కారం చూపనున్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ అవసరాల కోసం ఓ సర్వే నంబర్లో కొంత భూమిని సేకరిస్తే, ఆ సర్వే నంబర్లోని మొత్తం భూమి నిషేధిత జాబితాలో కనిపిస్తున్నదని ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ఈ విషయం క్యాబినెట్ సబ్ కమిటీ దృష్టికి సైతం వచ్చింది. ఇలాంటి సందర్భాల్లో వివిధ మంత్రిత్వశాఖల సమన్వయంతో రికార్డులు మార్చాలని కమిటీ ఆదేశించినట్టు తెలిసింది.