కేరళలో ప్రభుత్వ ఏర్పాటు అనంతరం తెలంగాణలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి పెట్టనున్నట్టు సమాచారం. ఐదు రాష్ర్టాల ఎన్నికల తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికలు ముగియగా, కేరళలో ప్రభుత్వ ఏర్పాటుపై గురువారం ప్రకటన వెలువడనున్నది. ప్రమాణ స్వీకారం అనంతరం ఢిల్లీ పెద్దలు తెలంగాణపై దృష్టి పెట్టనున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టి రెండున్నరేండ్లు పూర్తవుతున్నా ఇప్పటికీ పూర్తిస్థాయి మంత్రిమండలి ఏర్పడలేదు. 18 మంత్రి పదవులు ఉండగా, 16 మంది మాత్రమే ఉన్నారు. మరో రెండు పదవులు ఖాళీగానే ఉన్నాయి. చివరగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ముందు అజారుద్దీన్, వివేక్‌కు మంత్రివర్గంలో చోటు కల్పించారు. మిగతా రెండు బెర్తుల భర్తీపై అధిష్ఠానం ఊరిస్తూనే ఉన్నది. కీలక రాష్ర్టాల ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో వాటిని భర్తీ చేయక తప్పని పరిస్థితి నెలకొన్నది.
ఇప్పటికే రెండున్నరేండ్లు గడిచిపోయిందని, ఇప్పుడు కూడా భర్తీ చేయకపోతే కొత్తగా పదవి తీసుకునేవారికి కనీసం కుర్చీలో కూర్చునే సమయం కూడా ఉండదని ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఉన్న రెండున్నరేండ్లలో చివరి ఏడాది ఎన్నికల సంవత్సరంగానే ఉంటుందని, మధ్యలో ఉండేది కేవలం ఏడాదిన్నర మాత్రమే అని ఆశావహులు అధిష్ఠానం వద్ద మొరపెట్టుకుంటున్నారట. దీంతో అధిష్ఠానం కూడా కేరళలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ పూర్తయిన తర్వాత పదవుల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని చెప్తున్నారు.
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కన్నా, పునర్వ్యవస్థీకరణ చేపడితేనే మేలు అని ముఖ్యనేత అధిష్ఠానాన్ని ఒప్పించే పనిలో ఉన్నారని సమాచారం. కొత్త వారిని మంత్రివర్గంలోకి తీసుకోవడంతోపాటు పాతవారి వద్ద ఉన్న శాఖలను కూడా మారిస్తే బాగుంటుందని చెప్పినట్టు తెలిసింది. కొన్ని శాఖల్లో మార్పులు అనివార్యమని, అధిష్ఠానమే వారిని ఒప్పించాలని కోరినట్టు ఢిల్లీ వర్గాలు తెలిపాయి. సీనియర్ల శాఖలనే కత్తిరించేలా ముఖ్యనేత ప్రయత్నాలు చేస్తున్నారట. ప్రధానంగా నంబర్ టూ అని చెప్పుకొని తిరుగుతున్న మంత్రిపైనే గురిపెట్టారని, ఆయన వద్ద ఉన్న కీలకమైన భూముల శాఖను పీకేయాలని అధిష్ఠానాన్ని కోరినట్టు తెలిసింది. అయితే, సదరు మంత్రి కూడా ముఖ్యనేత ప్రయత్నాలకు చెక్ పెట్టేందుకు తన లాబీ ద్వారా రంగంలోకి దిగారని చెప్తున్నారు.
తనకు మున్సిపల్ శాఖ ఇవ్వాలంటూ ఆయన అధిష్ఠానాన్ని కోరారని సమాచారం. తనకు పురపాలక శాఖపై పట్టున్నదని, అందుకే తనకు ఆ శాఖ ఇస్తే పార్టీకి, ప్రభుత్వానికి కూడా ‘ప్రయోజనం’ ఉంటుందని చెప్పినట్టు తెలిసింది. ముఖ్యనేత తర్వాత ముఖ్యనేతగా మంత్రివర్గంలో చలామణి అవుతున్న అసలు కాంగ్రెస్ మంత్రి వద్ద నుంచి ప్రధాన శాఖను తీసివేయాలని ప్రయత్నం జరుగుతున్నట్టు సమాచారం. ఇప్పటికే కమీషన్లు, పర్సంటేజీల పేరుతో ఆయనను అధిష్ఠానానికి దూరం చేసినట్టు చెప్తున్నారు. ఇప్పుడు ఆయన శాఖల్లో కత్తెర వేయబోతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. మరో అసలు కాంగ్రెస్ సీనియర్ మంత్రిని కూడా ముఖ్యనేత టార్గెట్ చేసినట్టు సమాచారం. ఆయన శాఖలోని కార్యదర్శుల నియామకం విషయంలో కూడా స్వేచ్ఛ ఇవ్వకుండా ఇబ్బందిపెట్టిన ముఖ్యనేత.. తాజాగా ఆయన వద్ద ఉన్న పెద్ద శాఖను తీసివేయాలని యోచిస్తున్నట్టు తెలిసింది.
ఆదాయం తెచ్చే శాఖను ఆయనకు ఇచ్చి, పెట్టుబడులు తెచ్చే శాఖను తీసుకోవాలని ముఖ్యనేత భావిస్తున్నారట. అసలు కాంగ్రెస్‌కు చెందిన మరో మంత్రి వద్ద ఉన్న ఒక శాఖను కూడా మార్చాలని చూస్తున్నట్టు తెలిసింది. ఆయన ముఖ్యనేత అరాచకాలపై పార్టీ అధిష్ఠానానికి తరచూ లేఖలు పంపుతుంటారని, ఇది తలనొప్పిగా మారిందని ముఖ్యనేత పలు సందర్భాల్లో పార్టీలోని తన వర్గం వారితో కూడా అన్నట్టు సమాచారం. తెలంగాణ ఉద్యమంలో తాము ఉన్నామంటూ తరచూ స్టేట్మెంట్లు ఇచ్చే ఇద్దరు మంత్రుల శాఖల్లో కూడా కోత పెట్టాలని యోచిస్తున్నట్టు తెల్సింది. ఈమేరకు పార్టీ అధిష్ఠానాన్ని కూడా ఒప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు చెప్తున్నారు.
ప్రభుత్వంలో ఇంకో రెండు క్యాబినెట్ బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఆ రెండు బెర్తులను ఎవరితో భర్తీ చేస్తారన్న ఆసక్తి పార్టీలో నెలకొన్నది. ఇప్పటికే డిప్యూటీ స్పీకర్ పదవిని డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ తిరస్కరించారు. ఆయన మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రెండు బెర్తుల్లో తనకు ఒకటి ఖాయమని ప్రచారం చేసుకుంటున్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సైతం తనకు మంత్రి పదవి ఖాయమని చెప్పుకుంటున్నారు. పైగా ఎలా ఇవ్వరో చూస్తానంటూ తీవ్ర స్వరంతో పార్టీ పెద్దలను హెచ్చరించారు.
దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు, బోధన్‌కు చెందిన సీనియర్ నేత పీ సుదర్శన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ విజయశాంతి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ మంత్రి పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడంతో ఆ వైపు ఆలోచన చేస్తారనే చర్చ జరుగుతున్నది. మరోవైపు ఇప్పుడున్న మంత్రివర్గం నుంచి ఒకరిద్దరికి ఉద్వాసన తప్పదని ప్రచారం జరుగుతున్నది. ఉమ్మడి వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన మంత్రులుంటారని చెప్తున్నారు. ఒకవేళ వీరిని తప్పిస్తే ఎలాంటి విపరిణామాలు వస్తాయోననే భయం కూడా అధిష్ఠానం మదిలో ఉన్నట్టు చెప్తున్నారు.