హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై గతంలో క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన మినట్స్, సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు సమర్పించినట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల ఆరోపణలపై ఏర్పాటైన ఈ కమిషన్ ఇప్పటికే పలువురిని ప్రశ్నించింది. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని నిర్ణయాలను క్యాబినెట్ ఆమోదంతోనే తీసుకున్నామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావు విచారణ సందర్భంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై గత ప్రభుత్వం క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన నివేదికలన్నీ అందజేయాలని ప్రభుత్వానికి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ లేఖ రాయడంతో ఈ నెల 30లోగా వాటిని సమర్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఆ క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ హయాంలో క్యాబినెట్ నిర్ణయాలకు సంబంధించిన మినట్స్ తదితర డాక్యుమెంట్లను ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు సమర్పించినట్టు తెలుస్తున్నది.
జీబీ లింక్‌పై రేపు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ; కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమం
హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ఏపీ ప్రభుత్వం చేపట్టిన గోదావరి-బనకచర్ల (జీబీ) లింక్ ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రజాభవన్‌లో నిర్వహించనున్న ఈ ప్రజెంటేషన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార ముఖ్యఅతిథులుగా హాజరు కానున్నారు. ఈ ప్రజెంటేషన్ ద్వారా జీబీ లింక్ ప్రాజెక్టుకు సంబంధించిన వాస్తవాలను రాష్ట్ర మంత్రివర్గంతోపాటు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ కమిషన్ల చైర్మన్లకు తెలియజేయడంతోపాటు ఆ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణకు జరిగే నష్టాన్ని వివరించనున్నట్టు ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు.