కాంగ్రెస్‌లో కుంపట్లు ఆరడం లేదు. మంత్రుల మధ్య సెగలు చల్లారడం లేదు. పొన్నం- అడ్లూరి ఇష్యూ చల్లబడకముందే వివేక్-లక్ష్మణ్ మధ్య మాటల మంటలు రాజుకున్నాయి. ఇక ఇన్చార్జి మంత్రి పొంగులేటిపై వరంగల్ మంత్రులు కొండా సురేఖ, సీతక్క కారాలు నూరుతున్నారు. అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనా చివరి నిమిషంలో సీఎం, నేతల ఒత్తిడితో వారు వెనక్కి తగ్గినట్టు సమాచారం.
హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో.. ఆ వివాదం సద్దుమణిగినట్టేనని భావిస్తున్న నేపథ్యంలో ఇదే వివాదంతో సంబంధం ఉన్న ఉన్న మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మరోసారి కెలికారు. మంత్రి అడ్లూరి కులం ఆధారంగా తనపై కుట్రపూరిత ఆరోపణలు చేస్తున్నారని వివేక్ మండిపడ్డారు. అడ్లూరిని రాజకీయాల్లో ప్రోత్సహించింది తన తండ్రేనని, అది ఆయన మరిచిపోయారని వివేక్ వ్యాఖ్యానించారు. దీనిపై అడ్లూరి స్పందిస్తూ.. వివేక్ కొడుకును ఎవరు ఎంపీగా గెలిపించారో ఆయనకు తెలుసు. ఎవరు ఎవరిని అవమానిస్తున్నారో చర్చకు సిద్ధమని సవాల్ విసరడంతో వివాదం మరోసారి రాజుకున్నది.
ఇదీ నేపథ్యం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గ ఇన్చార్జ్ మంత్రులు ఇటీవల ముస్లిం మైనార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశానికి మంత్రులు పొన్నం, వివేక్ వెంటస్వామి హాజరయ్యారు. కానీ, మైనార్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ రావడం కొంత ఆలస్యమైంది. దీంతో పొన్నం అసహనానికి లోనయ్యారు. పక్కనే ఉన్న మంత్రి వివేక్ చెవి దద్గరకు వంగి ‘మనకి టైం అంటే తెలుసు.. జీవితం అంటే తెలుసు.. వానికేం తెలుసు.. ఆ..దున్నపోతుగానికి’ అంటూ వివేక్ చెవిలో గుసగుసగా బాడీషేమింగ్ వ్యాఖ్యలు చేశారు. మాదిగ సామాజికవర్గం నేతలు ఈ వ్యాఖ్యల పట్ల తీవ్రం అభ్యంతరం వ్యక్తంచేశారు. అడ్లూరి లక్ష్మణ్ పరిధిలో ఉన్న మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్, వివేక్ వేలుపెట్టడమే తప్పని, వారు ఢిల్లీ వెళ్లే ప్రయత్నంలో అరగంట ముందుగానే అక్కడకు చేరుకొని లక్ష్మణ్ రాలేదని ప్రచారం చేయడం, పొన్నం బాడీషేమింగ్ వ్యాఖ్యలు చేస్తుంటే, మరో మంత్రి ఆయనకు మద్దతుగా మాట కలిపారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఇవి వ్యక్తిగత విమర్శలు కావని, మాదిగజాతి మీద చేసిన విమర్శలని ప్రత్యక్ష ఆందోళనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో బడుగు, బలహీనవర్గాలకు చెందిన మంత్రుల మధ్య ఏర్పడిన వివాదం అధికార పార్టీని డిఫెన్స్‌లోకి పడేసింది. దీంతో ఆందోళన చెందిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇద్దరు మంత్రులను పిలిచి రాజీచేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు సూచించినట్టు తెలిసింది. మహేశ్‌కుమార్‌గౌడ్ ఆ ఇద్దరు నేతలను తన ఇంటికి పిలిచి రాజీ కుదిర్చారు. రాజీలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సహచర మంత్రి లక్ష్మణ్‌కు వ్యక్తిగతంగా క్షమాపణ చెప్తున్నట్టు ప్రకటించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఒత్తిడితో పొన్నం ప్రభాకర్, వివేక్ వెంటస్వామిని అడ్లూరి లక్ష్మణ్ క్షమించినా.. దళితజాతి బిడ్డలు వారిని క్షమించరని, వారిపై పార్టీపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకునే వరకు ఊరుకోబోమని మాదిగ సామాజిక వర్గం నేతలు హెచ్చరించారు.
మా నాయిననే నిన్ను ప్రోత్సహించిండని కెలికిన వివేక్
తాజాగా ఆదివారం నిజామాబాద్‌లో జరిగిన మాలల సదస్సులో మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొందరు విషం నింపి అడ్లూరి లక్ష్మణ్‌తో విమర్శలు చేయిస్తున్నారని, తాను మాల కావడం వల్లే తనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. సోషల్‌మీడియా ద్వారా తనపై కులపరమైన కుట్రలు, విమర్శలు చేస్తున్నారని, తనను విమర్శించడం ఓ ప్యాషన్ అయిపోయిందని అన్నారు. మాల, మాదిగల మధ్య విభేదాలు సృష్టించాలని కొందరు చూస్తున్నారని ఆరోపించారు. ‘రాజకీయాల్లో అడ్లూరిని ప్రోత్సహించిందే మా నాయిన.. అది ఆయన మరిచిపోయి నా మీద విమర్శలు చేస్తున్నరు’ అని వివేక్ వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి తాను ఇన్చార్జిగా ఉన్నానని, ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే తనకు మంచి పేరు వస్తుందనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
నీ కొడుకును ఎవరు గెలిపించారో : అడ్లూరి
వివేక్ వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. ఆదివారం సాయంత్రం ఒక ప్రైవేట్ చానల్‌తో మాట్లాడారు. వివేక్ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానంటూనే.. ఆయన కొడుకును ఎంపీగా ఎవరు గెలిపించారో వివేక్‌కు తెలుసని పేర్కొన్నారు. ఎవరు ఎవరిని అవమానిస్తున్నారో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. సద్దుమణిగిన వివాదాన్ని వివేక్ మళ్లీ తెర మీదకు తెచ్చారని, ఈ వివాదాన్ని మళ్లీ ఎందుకు రాజేస్తున్నారో అర్థంకావడంలేదని అన్నారు. ఇక దీనిపై తానేమీ మాట్లాడనని, అధిష్ఠానమే చూసుకుంటుందని ముక్తసరిగా మాట్లాడారు. దళిత సామాజికవర్గానికి చెందిన సహచర మంత్రిని దూషిస్తుంటే.. ఇంకో దళిత మంత్రిగా ఉండి కనీసం వారించకపోవడమేమిటని వివేక్ తీరును మాదిగ నేతలు తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యలను వివేక్ ఖండించకపోగా, సమర్థించినట్టు హావభావాలు ప్రదర్శించినట్టు వీడియో క్లిప్పింగ్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇంతలోనే వివేక్ చేసిన తాజా వ్యాఖ్యలు ఏ పరిణామాలకు దారితీస్తాయోనని ప్రభుత్వ పెద్దలు ఆందోళనతో ఉన్నట్టు సమాచారం.