హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఖాళీగా ఉన్న క్యాబినెట్ బెర్తులను మరికొంతకాలంపాటు కోల్డ్స్టోరేజీలోనే ఉంచాలని అధిష్ఠానం నిర్ణయించినట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటికే మంత్రివర్గంలో చోటు సంపాదించిన రెండు కుటుంబాలు రెండో బెర్తు కోసం పట్టుబడుతుండటం, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒకే బలమైన సామాజికవర్గానికి చెందిన ఇద్దరు నేతలు పట్టువీడకపోవడంతో విస్తరణపై పీఠముడి పడినట్టు తెలుస్తున్నది. మరోవైపు, ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రికి గిట్టని వ్యక్తికి అనివార్యంగా మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుండటం కూడా మంత్రివర్గ విస్తరణ జాప్యానికి కారణమని కాంగ్రెస్ వర్గాలు బహిరంగంగానే చర్చించుకుంటున్నాయి.
ప్రస్తుతం రాష్ట్ర క్యాబినెట్లో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. సామాజిక సమీకరణలకు అనుగుణంగా ప్రపోజల్స్ లిస్టుతో ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఇటీవల రాష్ట్ర పార్టీ నేతలను ఆదేశించినట్టు తెలిసింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్మున్షీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులు చర్చించి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఒక్కొక్కటి చొప్పున, బీసీలకు ప్రత్యేకించి ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒకటి, మిగిలిన రెండు స్థానాల్లో ఒకటి రెడ్డి సామాజిక వర్గానికి, మరొకటి వెలమకు ఇవ్వాలని సూచించినట్టు తెలిసింది. అధిష్ఠానం సూచన ప్రకారం రెడ్డి సామాజికవర్గానికి ఒకేఒక్క మంత్రి పదవి దక్కనుండగా, ఎనిమిది మంది పోటీ పడుతున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోల్రెడ్డి మొదటినుంచీ మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఇదే జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భార్య పద్మావతిరెడ్డి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమెకు అంచనాల పద్దుల కమిటీ చైర్మన్ పదవి ఇవ్వగా.. ఇప్పటివరకు ఆమె ఆ బాధ్యతలు స్వీకరించలేదు. కష్టకాలంలో పార్టీని నడిపించానని, పార్టీ కోసం సీఎం పదవిని త్యాగం చేసినందున తన భార్యకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పట్టుబడుతున్నట్టు సమాచారం. పార్లమెంటు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని గెలిపించుకుకొని వస్తే.. మంత్రి పదవి ఇస్తానని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినట్టు అప్పట్లో నల్లగొండ జిల్లాలో చర్చ జరిగింది.
ఈ నేపథ్యంలో తనకు మంత్రి పదవి ఇచ్చి తీరాల్సిందేనని పట్టుపడుతున్నట్టు తెలిసింది. అయితే, ఈ జిల్లా నుంచి ఇప్పటికే ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం నేతలు మంత్రివర్గంలో ఉండటం, మళ్లీ అదే కుటుంబానికి అవకాశం ఇస్తే.. పార్టీ కుప్పకూలి పోతుందని పీసీసీ భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇదే జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు గిరిజన నేత పేరును సూచిస్తూ, మధ్యేమార్గంగా ఎస్టీ లంబాడ సామాజికవర్గానికి చెందిన నేతకు మంత్రి పదవి ఇస్తే ఎలా ఉంటుందో ఆలోచించాలని సూచించినట్టు తెలిసింది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఎవరికి వారుగా ప్రయత్నాలు చేస్తున్నట్టు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. వీరితో పార్టీ సీనియర్ నాయకులు పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ, వారు మెట్టు దిగలేదని తెలుస్తున్నది. ఇద్దరిలో ఒకరికి ప్రత్యామ్నాయ పదవులు ఇస్తామనే హామీతో చర్చలు జరిపినా, వారు మా త్రం తమకు మంత్రి పదవి మాత్రమే కావాలని పట్టుబడుతున్నట్టు తెలిసింది. ఇప్పటికే వారి అనుచరులు ఫ్లెక్సీలు, వాల్‌పోస్టర్లు, డోర్పోస్టర్లు, సోషల్‌మీడియా మీమ్స్ సిద్ధంచేసి పెట్టుకొన్నారనే ప్రచారం జరుగుతున్నది.
మరోవైపు, ఇదే సామాజికవర్గానికి చెందిన నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, వరంగల్ జిల్లా నుంచి దొంతి మాధవరెడ్డి మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఇప్పటికైతే సుదర్శన్‌రెడ్డి రేసులో ముందున్నారని, దాదాపు బెర్త్ ఖరారైనట్టేనని గాంధీభవన్ నుంచి లీకులు వదులుతున్నారు. ఇదే జరిగితే దక్షిణ తెలంగాణ జిల్లాలకు చెందిన నలుగురు రెడ్లకు మొండిచెయ్యి చూపినట్టేనని భావిస్తున్నారు. అప్పుడు వారి నిర్ణయం ఎలా ఉంటుందోనని కాంగ్రెస్ వర్గా ల్లో కొంత ఆందోళనతో ఉన్నట్టు తెలుస్తున్నది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి రెండు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నదని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ప్రేమ్‌సాగర్ పేరు ఎప్పటినుంచో ప్రచారంలో ఉన్నది. అధిష్ఠానం ఒక వెలమ సామాజిక వర్గం నేతకు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్న నేపథ్యంలో ఆయన పేరు దాదాపు ఖరారైనట్టేనని ప్రచారం జరుగుతున్నది. అయితే ప్రేమ్‌సాగర్‌రావుకు రాష్ట్రంలోని ముఖ్య నేతకు అసలు పొసగడం లేదని, ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం ఇష్టం లేదని చెప్పుకుంటున్నారు. ఇదే జిల్లా నుంచి సోదర ద్వయం గడ్డం వివేక్, గడ్దం వినోద్ పోటీలో ఉన్నారు. అయితే, వీరిద్దరూ తన కంటే తనకే పదవి కావాలని పట్టుబడుతున్నట్టు తెలుస్తున్నది.
మంత్రి పదవి విషయంలో సోదరుల మధ్య అంతరం పెరిగినట్టు ప్రచారం జరుగుతున్నది. వీరిలో ఒకరిని మంత్రి పదవి వరించనున్నదని సమాచారం. హైదరాబాద్ నుంచి ముస్లిం మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ పేరును కాంగ్రెస్ పార్టీ తెరమీదికి తెచ్చినట్టు సమాచారం. బీసీ సామాజికవర్గం నుంచి ఒక బెర్త్ ఖరారు చేసినట్టు తెలిసింది. గౌడ సామాజికవర్గం నుంచి పొన్నం ప్రభాకర్‌గౌడ్ ఇప్పటికే ప్రాతినిథ్యం వహిస్తున్నందున, మరో కీలకమైన బీసీ సామాజిక వర్గం ముదిరాజులకు అవకాశం ఇవ్వాలనే ఆలోచన చేసినట్టు తెలుస్తున్నది. ఒకవేళ అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ముదిరాజ్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కే చాన్స్ ఉన్నదని భావిస్తున్నారు. అయితే, ఇదే ఉమ్మడి జిల్లా నుంచి మరో బీసీ ఎమ్మెల్యే కూడా మంత్రి పదవి రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.
ఊహించినంత సులువుగా సామాజిక సమీకరణల కూర్పు సాధ్యం కాదని, ఉడుము మూతికి తేనె పూసి కోట గోడలను ఎక్కించినట్టు మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ఊరింపుతో ఎంతకాలమైనా నెట్టుక రావొచ్చు కానీ, ఒకసారి పదవులు భర్తీ చేస్తే తలనొప్పులు వస్తాయని, అది ప్రభుత్వ పతనానికి కూడా దారి తీయవచ్చనే భయంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఉన్నట్టు తెలిసింది. ఇటీవల ఎమ్మెల్యేల రహస్య సమావేశం వెనుక మంత్రి పదవి ఆశిస్తున్న ఒక నేత ‘హస్తం’ ఉన్నట్టు పీసీసీకి సమాచారం అం దినట్టు తెలిసింది. ఈనేపథ్యంలో విస్తరణను తాత్కాలికంగా వాయిదా వేయడమే ఉత్తమమని అధిష్ఠానం భావిస్తున్నట్టు సమాచారం.