రేవంత్‌రెడ్డి సర్కారు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న కులగణన సర్వే బుట్టదాఖలు కాబోతున్నదా? కాంగ్రెస్ ప్రభుత్వం గత నవంబర్‌లో నిర్వహించిన ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కులగణన) ద్వారా వెల్లడించిన గణాంకాలు చెల్లుబాటు కాలేని పరిస్థితి రాబోతున్నదా? వెరసి, రేవంత్ సర్కారు అసెంబ్లీలో ప్రవేశపెట్టి, ఏకగ్రీవ ఆమోదం పొందిన బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు ప్రహసనంగానే మిగిలిపోయే ప్రమాదం ఉన్నదా? కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇలాంటి పరిస్థితే ఉత్పన్నం కాబోతున్నది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో నిర్వహించిన సభలో బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించింది. స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో బీసీలకు కల్పిస్తున్న రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తరువాత అడ్డదిడ్డంగా కులగణనను నిర్వహించి, అసంబద్ధమైన గణాంకాలనే ప్రామాణికంగా తీసుకుని బీసీలకు ఆయా రంగాల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. ఇదిలాఉంటే తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్ సర్కారు కల్పించిన 42% రిజర్వేషన్ అమలు కూడా ఇక అటకెక్కినట్టే!
Caste Census | హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): త్వరలో దేశవ్యాప్తంగా చేపట్టబోయే జనాభాగణనలోనే కులగణనను కూడా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం (రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ) నిర్ణయించిన నేపథ్యంలో తెలంగాణలో ఇటీవల నిర్వహించిన కులగణన బుట్టదాఖలయ్యే పరిస్థితి నెలకొన్నది. రాష్ర్టాలు నిర్వహించిన, నిర్వహిస్తున్న కులగణన సర్వేలకు పారదర్శకత లేదని కేంద్ర మంత్రి అశ్వినీవైష్ణవ్ స్పష్టం చేయడమే ఇందుకు కారణం. కులగణన అంశం పూర్తిగా కేంద్రం పరిధిలోనిదేనని, వివిధ రాష్ర్టాల్లో కులగణన సర్వేలను రాజకీయ కారణాలతోనే చేపట్టారని అశ్వినీ వైష్ణవ్ పేర్కొనడం గమనార్హం. దీంతో తెలంగాణలో రేవంత్ సర్కారు నిర్వహించిన సర్వే బుట్టదాఖలు కానున్నది. కాంగ్రెస్ పార్టీది, ప్రభుత్వానిది కేవలం ఓట్ల రాజకీయం తప్ప మరేమీ కాదని తేటతెల్లమైంది. వెరసి సర్వే కోసం వెచ్చించిన రూ.160 కోట్లు నిరుపయోగంగా మారాయి. వాస్తవానికి ‘జనాభాగణన’, ‘సర్వే’ అనేవి రెండూ వేర్వేరుఅంశాలు. ‘జనాభాగణన’ అంటే మొత్తం ప్రజల సమస్త సమాచారాన్ని సేకరించడం. ‘సర్వే’ అనేది నిర్దేశిత లక్ష్యాలతో ఏదైనా ఒక అంశానికి సంబంధించి, మొత్తం జనాభాలో కొంతమందిని శాంపిల్‌గా ఎంపిక చేసుకుని నిర్వహించేది.
అందుకు సంబంధించి దేశంలో రెండు రకాల చట్టాలు ఉన్నాయి. జనాభాగణన అనేది 7వ షెడ్యూల్లో కేంద్ర జాబితాలోని అంశం. జనాభాగణన చట్టం-1948 ప్రకారం.. జనాభాగణన చేపట్టే అధికారం కేవలం కేంద్రానికి మాత్రమే ఉన్నది. జనాభాగణన నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు లేవు. ఒకవేళ రాష్ర్టాలు చేసినా ఆ గణాంకాలకు చట్టబద్ధత ఉండదు. వాటిని అమలు చేసే అవకాశం కూడా లేదు. మరోవైపు, కేంద్ర ప్రభుత్వమే ‘గణాంకాల సేకరణ చట్టం-2008’ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు డాటా సేకరణకు కొన్ని పరిమిత అధికారాలను బదలాయించింది. నిర్దేశిత అంశానికి సంబంధించిన గణాంకాలను సేకరించే అధికారాన్ని రాష్ర్టాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలు, ఆ తరువాత పంచాయతీలు, మున్సిపాల్టీలకు సైతం కల్పించింది. అదే సమయంలో కొన్ని షరతులను విధించింది. 2017లో ఈ చట్టానికి మరిన్ని సవరణలు చేసింది. 2008 చట్టం ద్వారా 7వ జాబితాలోని జనాభాగణనను రాష్ర్టాలు నిర్వహించకూడదు. అది రాష్ర్టాల పరిధిలోకి రాదు. ఒకవేళ ఏదైనా రాష్ట్రం నిర్వహించాలని భావించినా అందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. అంతేకాదు, రాష్ర్టాలు సేకరించిన డాటా వెల్లడిపై కూడా అనేక ఆంక్షలు విధించింది. రేవంత్ సర్కారు మాత్రం ‘ఇంటింటి సర్వే’ అని చెప్పి రాష్ట్రవ్యాప్తంగా జనాభాగణనను నిర్వహించి అందరినీ మభ్యపెట్టింది. గణాంకాల సేకరణ చట్టం-2008 ప్రకారం సర్వే నిర్వహించాలంటే కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉన్నది.
రిజిస్ట్రార్ ఆఫ్ ఎంక్వయిరీస్ చట్టం-1952 ప్రకారం స్వయం ప్రతిపత్తి కలిగిన కమిషన్‌ను ఏర్పాటు చేయడంతోపాటు గణాంకాల సేకరణకు ఒక ప్రభుత్వశాఖను నోడల్ డిపార్ట్మెంట్గా నియమించాలి. అంతేకాకుండా నోడల్ ఆఫీసర్‌ను, కమిషన్‌కు సెక్రటరీని కూడా నియమించాల్సి ఉంటుంది. నేషనల్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్, స్టాటిస్టిక్స్, ఎన్ఎస్ఎస్వో తదితర విభాగాల నుంచి రాష్ర్టానికి చెందిన లేటెస్ట్ ఇండ్ల జాబితాను, బ్లాక్‌ల వారీగా రూపొందించిన హౌసింగ్ మ్యాపులను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సర్వే ప్రశ్నావళి రూపకల్పనకు సంబంధించిన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సేకరించిన డాటాను కూడా అందుబాటులో ఉన్న ప్రామాణికమైన డాటాతో అంటే ఓటర్, ఆధార్, రేషన్‌కార్డు తదితర జాబితాలతో విశ్లేషించాల్సి ఉంటుంది. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అవకాశాలకు సంబంధించిన స్థితిగతులను తులనాత్మక అధ్యయనం చేయాల్సి ఉంటుంది. తుదకు అన్నింటినీ క్రోడీకరించి, విశ్లేషించి తుది నివేదికను రూపొందించాలి. ఆ నివేదికకు క్యాబినెట్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఆ తరువాత తుదకు కేంద్రం ఆమోదం పొందిన తరువాతనే ఆ గణాంకాలను ప్రామాణికంగా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ,శశ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కులగణన అంశంలో ఆ నిబంధనలన్నింటికీ తిలోదకాలిచ్చింది. సర్వే చెల్లబోదని మేధావులు, నిపుణులు నెత్తినోరు కొట్టుకుని చెప్పినా, అటకెక్కిన బీహార్ తదితర రాష్ర్టాల సర్వేలను ఉదహరించినా వినిపించుకోలేదు. కేవలం రాజకీయాల కోసం తప్ప మరేమీ కాదన్నట్టుగా వ్యవహరించింది.
ఎలాంటి తులనాత్మక అధ్యయనం చేయకుండానే రేవంత్ సర్కారు రాష్ట్రంలో ఇంటింటి సర్వేను దాదాపు రూ.160 కోట్ల వ్యయంతో నిర్వహించింది. రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో గత నవంబర్‌లో ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కులగణన) చేపట్టింది. సర్వేకు సంబంధించిన నివేదికను అసెంబ్లీలో వెల్లడించింది. ఆ గణాంకాలపై విమర్శలు వెల్లువెత్తడంతో మళ్లీ రీ సర్వే నిర్వహించింది. స్థూలంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీ వర్గాల గణాంకాలనే బయటపెట్టింది. డాటా ప్రైవేసీ యాక్ట్‌ను ఉటంకిస్తూ కులాలు, ఉపకులాల వారీగా వివరాలను గోప్యంగా దాచిపెట్టింది. పూర్తిస్థాయి నివేదికను వెల్లడించకపోవడంతో సర్వే గణాంకాలకు సాధికారత లేకుండా పోయింది. ప్రస్తుతం కేంద్ర మంత్రి ప్రకటనతో ఈ గణాంకాలు కూడా బుట్టదాఖలు కానున్నాయి. దీంతో రూ.160 కోట్ల ప్రజాధనం వృథా అయ్యింది.
కులగణన కోసం ఓబీసీ వర్గాలు దశాబ్దాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాయి. 2014 ఎన్నికల సమయంలోనే బీజేపీ సర్కారు కులగణన చేపడతామని హామీ ఇచ్చింది. కానీ, ఇప్పటివరకు నిర్వహించలేదు. సున్నితమైన అంశం అంటూ దాటవేస్తూ వచ్చింది. ఓబీసీ వర్గాల కులగణన డిమాండ్‌కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదినుంచీ అండగా నిలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే జనగణనలో కులగణన చేయాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. అదేవిధంగా, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు. యూపీఏ-1 ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా ఉన్న సమయంలోనే బీసీ సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయాలని నాటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు వినతిపత్రం అందజేశారు. ఓబీసీ వర్గాల కులగణన కోసం ప్రతి సందర్భంలోనూ కేసీఆర్ గళం విప్పారు. బీసీ వర్గాల సంక్షేమం, అభ్యున్నతికి పదేండ్ల పాలనలో విప్లవాత్మక పథకాలను అమలు చేశారు.