హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మిర్చి రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వం నేరుగా కంపెనీలతో పంటను కొనుగోలు చేయించేందుకు ప్రయత్నిస్తున్నది. దీనిలో భాగంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, జనగామ, వరంగల్, సూర్యాపేట జిల్లాల్లో ‘తేజ’ రకం మిర్చిని ప్లాంట్ లిపిడ్స్ సంస్థతో కొనుగోలు చేయించేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఈ ఏడాది కూడా ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ 6 జిల్లాల్లో 20 వేల టన్నుల మిర్చిని రైతు ఉత్పత్తిదారుల సంఘం (ఎఫ్పీసీ) ద్వారా సేకరించనున్నది. నిరుడు ఖమ్మం జిల్లాలో మాత్రమే ‘తేజ’ మిర్చిని సేకరించారు. 2,147 టన్నుల ‘తేజ’ మిర్చిని రూ.39 కోట్లకు ప్లాంట్ లిపిడ్స్ కొనుగోలు చేసింది. దీని నుంచి నూనె తయారుచేసి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మిగిలిన వ్యర్థాలను రంగుల తయారీకి ఉపయోగిస్తున్నారు.
రైతులకు ప్రయోజనం
ప్లాంట్ లిపిడ్స్ నేరుగా మిర్చిని సేకరించడం వల్ల రైతులకు రవాణా భారంతోపాటు దళారుల బెడద, కమిషన్ చెల్లింపు, తరుగు లాంటి సమస్యలు తప్పుతాయి. మిర్చిని తూకం వేసినప్పుడు బస్తాకు అదనంగా ఎన్ని గ్రాములున్నా ఆ సరుకుకు కూడా ధర కట్టి సొమ్ము చెల్లిస్తారు. దీంతో రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.
కంపెనీని సందర్శిస్తున్న రైతులు
మహబూబాబాద్ జిల్లా కురవిలో ఏర్పాటైన ప్లాంట్ లిపిడ్స్ సంస్థ.. మిర్చి నాణ్యత, పంట కొనుగోలు సుమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై రైతులకు, ఎఫ్పీసీలకు అవగాహన కల్పించనున్నది. దీనిలో భాగంగా ఇటీవల ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు రైతులు, అధికారులు, ఎఫ్పీసీ ప్రతినిధులు ఆ సంస్థను సందర్శించారు. ఈ నెల 21న భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, మహబూబాబాద్, వరంగల్, సూర్యాపేట జిల్లాల డీఆర్డీవో అధికారులు, డీపీఎంలు, ఎఫ్పీసీల ప్రతినిధులు ఆ కంపెనీని సందర్శించనున్నారు.