మూసాపేట/భూత్పూర్, మే 27 : అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని దేవరకద్ర మాజీ ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ‘ముఖ్యమంత్రి గారు.. మన పాలమూరు జిల్లా రైతుల గోసను పట్టించుకొని తడిసిన ధాన్యాం కొనాలి’ అని కోరారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం హస్నాపూర్, షేర్‌పల్లి గ్రామాల్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు అనే రైతు మాట్లాడుతూ.. తన ధాన్యాన్ని తూకం వేసేందుకు ఐకేపీ వరి కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు వెంకటయ్య ప్ర తి బస్తాకూ అదనంగా రూ.15 డిమాండ్ చేస్తున్నాడని, మరో వైపు తరుగు పేరుతో దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
స్పందించిన మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి వెంటనే కలెక్టర్ కుష్బూగుప్తాతో ఫోన్లో మా ట్లాడి.. తడిసి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, దోపిడీకి పాల్పడుతున్న కొనుగోలు కేంద్రం నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఆల మీడియాతో మాట్లాడుతూ రైతుల కష్టాలను పాలకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. క నీసం అధికారులైనా పట్టించుకోవాలని సూ చించారు. కేంద్రాల నిర్వాహకులు తరుగు, లంచం పేరుతో రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఇంత అవినీతి జరుగుతున్నా ఎవరు పట్టించుకోకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.