ఖలీల్వాడి, జూలై 8 : ఆర్టీసీలో కారుణ్య నియామకాల ద్వారా విడతల వారీగా 1,200 ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. శుక్రవారం ఆయన నిజామాబాద్ నుంచి తిరుమలకు బస్సు సర్వీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ సిబ్బందికి త్వరలోనే బకాయిలు చెల్లిస్తామన్నారు. తిరుమల తిరుపతి వెంకన్న దర్శనం కోసం రాష్ట్ర వ్యాప్తంగా రోజూ వెయ్యి మందికి రూ.300 ప్రత్యేక శీఘ్ర దర్శన టికెట్లను బుక్ చేసుకొనే వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు. ఇతర వివరాల కోసం టీఎస్ ఆర్టీసీ వెబ్సైట్ www.tsrtconline.in లేదా టికెట్ బుకింగ్ కౌంటర్లలో ఈ ప్యాకేజీని పొందవచ్చని సూచించారు. కనీసం 7 రోజుల ముందుగానే టికెట్ బుక్ చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, నగర మేయర్ నీతూకిరణ్, జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్, ఐడీసీఎంఎస్ చైర్మన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.