హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): ఇప్పటికే హైదరాబాద్ సిటీ బస్సు చార్జీలను భారీగా పెంచిన ఆర్టీసీ (TGSRTC) యాజమాన్యం.. ఇక రాష్ట్రవ్యాప్తంగానూ చార్జీల మోతమోగించేందుకు (Bus Fare Hike) సిద్ధమవుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తరువాత అన్ని బస్సుల చార్జీలను పెంచేందుకు ఆర్టీసీ యాజమాన్యం సమాయత్తమవుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. హైదరాబాద్ సిటీ బస్సుల్లో సవరించిన ధరలు సోమవారం నుంచే అమల్లోకి రావడంతో పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహాలక్ష్మి ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి రావల్సిన నిధులు భారీగా పెండింగ్ ఉండటం, ప్రతినెలా వేతనాలు ఇచ్చేందుకు కూడా సంస్థ నానా ఇబ్బందులు పడుతుండటంతో బస్‌చార్జీల పెంపు అనివార్యమని సంస్థ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
ఈ మేరకు సంస్థకు చెందిన ఉన్నతాధికారులు గత నెలలోనే కసరత్తు ప్రారంభించినట్టు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సు చార్జీలను కూడా సిటీ బస్సులతోపాటే పెంచాలని భావించినప్పటికీ, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని వాయిదా వేసినట్టు తెలిసింది. ఇప్పటికే తమ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్న ఈ సమయంలో బస్ చార్జీలు కూడా పెరిగితే.. ఆ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడుతుందని ప్రభుత్వం భావించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సూచన మేరకు ఇప్పట్లో ఎన్నికలులేని జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే బస్ చార్జీలను ఆర్టీసీ సవరించింది. ఎలక్ట్రిక్ బస్‌లను ఏర్పాటుచేస్తున్న నేపథ్యంలో మౌలిక వసతులు కల్పించేందుకే బసు చార్జీలను పెంచుతున్నట్టు ఆర్టీసీ చెప్తున్నా.. దాని వెనుక ఆంతర్యం వేరే ఉన్నట్టు తెలుస్తున్నది.
త్వరలో ప్రభుత్వానికి నివేదిక!
స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత బస్ చార్జీలు ఎంత పెంచాలి? ఎంత పెంచితే సంస్థకు లాభదాయకంగా ఉంటుంది? అలా పెంచడంతో ప్రతిపక్షాలు, ప్రజల నుంచి వ్యక్తమయ్యే నిరసనలపై నివేదికను కూడా సిద్ధంచేస్తున్నట్టు తెలిసింది. ఈ నివేదికను త్వరలో ప్రభుత్వానికి అందజేయనున్నట్టు సమాచారం. మహాలక్ష్మి పథకంతో సంస్థపై ఆర్థిక భారం పడుతుండగా.. ఆ ఒత్తిడి క్షేత్రస్థాయిలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు అనుభవిస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ ఆస్తులను చాలా వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్‌పరం చేస్తుండటాన్ని కార్మికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆర్టీసీ ట్రేడ్ యూనియన్ల నాయకులు సంస్థ తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఖర్చులు తగ్గించుకోవల్సిన చోట తగ్గించుకోకుండా, సంస్థను పూర్తిగా ప్రైవేట్‌పరం చేసే దిశగా ఆలోచిస్తున్నారని మండిపడుతున్నారు.