TGPSC | హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఒక వైపు కోర్టు కేసులు.. మరో వైపు సిబ్బంది కొరత.. అరకొర నిధులు. ఇంటిదొంగల బెదడ.. పైగా మితిమీరిన ప్రభుత్వ జోక్యం.. ఇలాంటి ఒత్తిడుల మధ్య టీజీపీఎస్సీ చైర్మన్ బాధ్యతలు కత్తిమీద సామేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీనియర్ ఐఏఎస్ బుర్రా వెంకటేశం టీజీపీఎస్సీ నూతన చైర్మన్గా నియమితులయ్యారు. ఆయన నియామకానికి గవర్నర్ ఆమోదం తెలపగా టీజీపీఎస్సీ చైర్మన్గా నియమిస్తూ సీఎస్ శాంతికుమారి జీవోను జారీచేశారు.
ప్రస్తుత చైర్మన్ డాక్టర్ ఎం మహేందర్రెడ్డి సోమవారం పదవీ విరమణ పొందనున్నారు. చట్టం ప్రకారం కమిషన్ చైర్మన్ గరిష్ఠంగా ఆరేండ్లు లేదా 62 ఏండ్ల వయస్సు వచ్చే వరకు పదవిలో ఉండవచ్చు. వయస్సు రీత్యా బుర్రా వెంకటేశం 2030 ఏప్రిల్ వరకు చైర్మన్గా కొసాగుతారు. ఐదున్నరేండ్లపాటు చైర్మన్గా వ్యవహరిస్తారు. ప్రభుత్వం జీవో జారీచేసిన నేపథ్యంలో బుర్రా వెంకటేశం సోమవారం లేదా ఒకట్రెండు రోజుల్లో బాధ్యతలను స్వీకరించనున్నట్టు తెలిసింది.
టీజీపీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించడమంటే కత్తిమీద సామేనన్న వాదనలు ఉన్నాయి. గ్రూప్-1 సహా పలు పేపర్ లీకేజీల్లో టీజీపీఎస్సీ ఉద్యోగుల హస్తమున్నట్టు బయటపడింది. కొత్త చైర్మన్ తొలుత ఇంటిని చక్కబెట్టుడుతూ.. తిన్నింటి వాసాలు లెక్కబెట్టేవారి పనిపట్టాల్సి ఉంటుందన్న వాదనలున్నాయి. టీజీపీఎస్సీలో ఉద్యోగుల కొరత మరో సమస్యగా మారింది. ఇటీవల కొత్తగా 142 పోస్టులను ప్రభుత్వం మంజూరుచేసింది. వీటిలో 58 పోస్టులను డిప్యూటేషన్, 11 పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీచేయాల్సి ఉన్నది.
కొత్తగా రిక్రూట్ చేసుకోవాల్సినవి 73 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఇదిలా ఉండగా 10 మంది సభ్యులు ఉండాల్సిన కమిషన్లో ప్రస్తుతం ఐదుగురు మాత్రమే ఉన్నారు. కమిషన్ సభ్యుల్లో అనితారాజేంద్ర ఫిబ్రవరిలో రామ్మోహన్రావు ఏప్రిల్లో పదవీ విరమణ పొందనున్నారు. ఏడాదిన్నర తర్వాత ప్రొఫెసర్ నర్రి యాదయ్య పదవీ విరమణ పొందుతారు. ఇప్పుడున్న సభ్యుల్లో కేవలం అమీరుల్లాఖాన్, పాల్వాయి రజినీకుమారి మాత్రమే ఎక్కువకాలం పదవీలో ఉండనున్నారు. దీంతో కొత్త సభ్యులను ప్రభుత్వం ఎప్పుడు నియమిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.