BRS | నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 20: కాంగ్రెస్ ప్రభుత్వం వానకాలం సీజన్ ముగుస్తున్నా రైతుభరోసా పథకంలో పంట సాయం అందించకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు అన్ని
మండల కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. మహబూబాబాద్‌లో జరిగిన ధర్నాలో ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో ఎకరాకు రూ.10 వేలు ఇచ్చామని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎకరాకు రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పి ఏడాది కావొస్తున్నా అతీగతీ లేదన్నారు. డోర్నకల్‌లో జరిగిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్, ఖిలావరంగల్‌లోని పడమరకోటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వరంగల్ తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్లకార్డులతో నిరసన తెలిపారు.
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో నిర్వహించిన ధర్నాలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, షాబాద్‌లో నిర్వహించిన ధర్నాలో బీఆర్ఎస్ యువ నాయకుడు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి, చేవెళ్లలో నిర్వహించిన ధర్నాలో డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, బొంగుళూరు చౌరస్తాలో నిర్వహించిన రాస్తారోకోలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, యువ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. వికారాబాద్ జిల్లా, బొంరాస్‌పేట మండలంలోని తుంకిమెట్లలో జరిగిన ధర్నాలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, పరిగి బస్టాండ్ వద్ద ధర్నాలో పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో జరిగిన ఆందోళనల్లో ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, మాణిక్‌రావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్, మహారెడ్డి భూపాల్‌రెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఇతర నాయకులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నిరసనలో పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్‌లో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, మద్దూరులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, జడ్చర్లలో మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్, వనపర్తి జిల్లా పాన్గల్లో కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మహబూబ్‌నగర్ మండలం కోడూరులో గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, గద్వాలలో బీఆర్ఎస్ నేత విజయ్‌కుమార్ పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం కేంద్రంలో జరిగిన నిరసనలో మాజీమంత్రి జోగు రామన్న పాల్గొని సీఎం ఫ్లెక్సీని దహనం చేశారు. మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, బెల్లంపల్లి లో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి ధర్నా చేపట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో జరిగిన ధర్నాల్లో మాజీ ఎమ్మెల్యే హరిప్రియానాయక్ పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని సిరిసిల్ల మానేరు బ్రిడ్జిపై బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో చేపట్టారు. పెద్దపల్లిలోని అంబేద్కర్ చౌక్‌లో రాజీవ్ రహదారిపై మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, అంతర్గాం మండల కేంద్రంలో బీఆర్ఎస్పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేశారు. జగిత్యాలలో జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత ఆధ్వర్యంలో తహసీల్ చౌరస్తాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేసి, రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ధర్మపురిలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, గంగాధర మండలంలోని మధురానగర్‌లో జరిగిన ఆందోళనలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాద, త్రిపురారంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ట్రైకార్ మాజీ ఛైర్మన్ రామచందర్‌నాయక్, మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, తిప్పన విజయసింహారెడ్డి, ఆత్మకూర్ ఎం.లో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ పాల్గొన్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, తాడ్వాయిలో చేపట్టిన ధర్నాలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పాల్గొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాగిరెడ్డిపేటలో రాస్తారోకో చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకొన్నారు. దీంతో వారు ర్యాలీగా వెళ్లి స్థానిక అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. బాన్సువాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద రైతు నిరసన దీక్ష చేపట్టారు. మేడ్చల్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకులు రైతులకు మద్దతుగా డీసీఎంఎస్ వైస్‌చైర్మన్ మధుకర్‌రెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.