నమస్తే తెలంగాణ న్యూస్‌నెట్‌వర్క్, మార్చి 9: కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడంపై ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా వ్యవహరించకుండా ప్రధాని మోదీ చెప్పినట్టు నడుచుకుంటున్నాయని మండిపడ్డారు. ఈ క్రమంలో బీజేపీ సర్కార్ తీరును నిరసిస్తూ గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బొమ్మరబోయిన నాగార్జున, కట్టా శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి చల్లా కోటేశ్ మాట్లాడుతూ.. ఇతర పార్టీల ప్రభుత్వాల కూల్చివేతకు మోదీ సర్కారు కుట్ర పన్నుతున్నదని విమర్శించారు. అందులో భాగంగానే ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిందని దుయ్యబట్టారు.
ప్రధాని మోదీ కక్షసాధింపు చర్యలు పాల్పడుతున్నారని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు విమర్శించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ను బలహీన పర్చాలనే ఉద్దేశంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎమ్మెల్సీ కవితకు ఈడీతో నోటీసులు పంపిందని దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం తగదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాల్జేయాలనే కుట్రలో భాగంగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును చేర్చారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణలో రాజకీయంగా లబ్ధిపొందాలనే లక్ష్యంతోనే బీఆర్ఎస్ నేతలను భయాందోళనకు గురిచేసేందుకు కుట్రలు పన్నుతున్నదని వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆరోపించారు. మహిళా సాధికారత, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను టార్గెట్ చేసి ఈడీతో నోటీసులు ఇప్పించడం దారుణమన్నారు.
సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు చేయడంతో బీజేపీలో వణుకు మొదలైందని, అందుకే ఎమ్మెల్సీ కవితపై సీబీఐ, ఈడీ దాడులకు ఉసిగొల్పుతున్నదని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలపై ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలతో దాడి చేస్తూ దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు. భూపాలపల్లి జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితకు మహిళా లోకం అండగా ఉంటుందని అన్నారు. ఆమెను ఈడీ పేరిట విచారణకు పిలవడాన్ని ఖండించారు.
ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం ముమ్మాటికీ తెలంగాణపై దాడిగానే భావిస్తామని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి తెలిపారు. కేంద్రంలోని మోదీ సరార్ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని విమర్శించారు. సీబీఐ సంస్థలను ఇష్టారీతిగా దుర్వినియోగం చేస్తున్న బీజేపీకి కాలం దగ్గరపడిందని ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచంద్రనాయక్ అన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబాన్ని బ్లాక్మెయిల్ చేయాలని కేంద్రం కుట్రలు చేస్తున్నదని, కవితకు నోటీసులు ఇచ్చినంత మాత్రాన బీఆర్ఎస్ బెదిరిపోదని తేల్చిచెప్పారు.