వరంగల్, మే 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వరంగల్‌లో చారిత్రక, వారసత్వ కట్టడం కూల్చివేతపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపూర్ మండలం అశోక్‌నగర్‌లో 800 ఏండ్ల నాటి కాకతీయుల కట్టడాన్ని ప్రభుత్వం ఇష్టారీతిన కూల్చివేసింది. ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ అస్థిత్వంపైనే దాడికి దిగడం దారుణమని, ఇలా చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే కూల్చివేసిన నిర్మాణాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కూల్చివేతపై ఈ నెల 6వ తేదీన ‘కాతీయ కట్టడంపై బుల్డోజర్, తెలంగాణ ఘనచరిత్రకు సమాధి’ అనే శీర్షికతో నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ కథనం పెనుసంచలనం రేపింది. చరిత్ర పరిశోధకులు, వారసత్వ నిర్మాణ పరిరక్షకులు సర్కారుతీరుపై తీవ్ర అభ్యంతరాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ్మనేని నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీకి సర్కార్ కూల్చివేతపై ఫిర్యాదు చేశారు. దీంతో నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని వరంగల్ జిల్లా కలెక్టర్, రాష్ట్ర పురావస్తుశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించిన విషయం తెలిసిందే.
అశోక్‌నగర్‌లోని కాకతీయ కట్టడం కూల్చివేతపై సర్కార్ వితండవాదానికి దిగింది. అసలు అక్కడ కట్టడమే లేదన్నట్టుగా, కూల్చివేతలో నిజమేలేదని ప్రకటించింది. అదే సమయంలో ఈనెల 6వ తేదీన నర్సంపేట రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, పురావస్తు శాఖ అధికారులు, ఖానాపూర్ తహసీల్దార్, తెలంగాణ విద్యా, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఈడబ్ల్యూఐడీసీ) ప్రతినిధులతో కలిసి సంయుక్తంగా తనిఖీ చేసినట్టు పేర్కొన్నది. అయితే, కూల్చివేతపై వస్తున్న ఆరోపణల్లో నిజంలేదని అసలు విషయాన్ని దాచివేసే ప్రయత్నం చేస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూల్ కాంప్లెక్స్ కోసం కేటాయించిన 30 ఎకరాల భూమిలో దట్టమైన పొదలు, చెట్లు ఉన్నాయని, వాటిని తొలగించి చదును చేస్తుండగా ఒక పాత శిథిల కట్టడం అవశేషాలు బయటపడ్డాయని అధికారులు తెలిపారు. ఇక వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో కూల్చివేతల శిథిలాలను స్వయంగా పరిశీలించారు. చరిత్రకారులు, స్థపతులు, పురావస్తు శాఖ అధికారులతో సంప్రదించి ఆ నిర్మాణాన్ని అదే ప్రాంతంలో పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అసలు అక్కడ ఎటువంటి కట్టడమే లేనప్పుడు ఎట్లా పునరుద్ధరిస్తామని హామీ ఎట్లా ఇచ్చారు? అని అధికారుల తీరుపై స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ చరిత్ర, సంస్కృతి, అస్తిత్వం మీద ఏమాత్రం అవగాహన లేని మూర్ఖుల పాలన రాష్ట్రంలో కొనసాగుతున్నదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాకతీయులు నిర్మించిన పురాతన శివాలయాన్ని రాష్ట్ర సరార్ ధ్వంసం చేసి కుప్పపోయడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు. వేల ఇండ్లను కరశంగా కూల్చి, లక్షల వృక్షాలను నరికిన రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు చారిత్రక సంపదను కూడా వదలడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే విధ్వంసాన్ని ఆపి కూల్చివేసిన శివాలయాన్ని, కాకతీయ కట్టడాన్ని పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ పాలకులకు కొత్త చరిత్రను నిర్మించటం తెలియకపోగా ఉన్న చరిత్రను కాపాడుకునే స్పృహలేకపోవటం దారుణమని తెలంగాణ అస్తిత్వవేదిక చైర్మన్ వీ ప్రకాశ్ ఆరోపించారు. తెలంగాణ అంతటా అడుగడుగునా చారిత్రక సంపద ఉందనే విషయాన్ని నిజాం గుర్తించి వాటిని పరిరక్షించాడని పేర్కొన్నారు. వరంగల్‌లోని కాకతీయుల కట్టడాన్ని నిర్లక్ష్యంగా కూల్చివేయడమే కాకుండా సాకులు వెతుకుతున్నదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన తప్పును తెలుసుకొని కూల్చివేసిన ఆలయాన్ని, చారిత్రక సంపదను పరిరక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.