హఠాత్తుగా, ఆకస్మిక యుద్ధ ప్రకటన చేసినట్టు
అర్ధరాత్రి శత్రుదేశంపై మెరుపుదాడికి దిగినట్టు..
శత్రుశిబిరంపైకి డజన్లకొద్దీ యుద్ధట్యాంకులను తోలినట్టు..
తెల్లారితే విజయం దక్కదేమోనని ఆదుర్దా పడినట్టు..
పచ్చని మొక్కను ఇనుపబూట్లతో కర్కశంగా నలిపేసినట్టు..
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆకుపచ్చని అడవిమీదికి బుల్డోజర్లతో విరుచుకుపడుతున్నది ప్రభుత్వం. బీభత్సకాండను కొనసాగిస్తున్నది. ఒకవైపు విద్యార్థుల పిటిషన్ కోర్టులో విచారణకు రాకముందే.. అడవినంతా తుడిచేయాలని తహతహలాడుతున్నది. 50 జేసీబీలు, 500 మంది పోలీసులను పెట్టి రాత్రీ పగలూ తేడా లేకుండా విధ్వంసాన్ని కొనసాగిస్తున్నది ప్రభుత్వం. ఇది సర్కారు కారుచిచ్చు! ఇది వర్సిటీపై గొడ్డలి వేటు!
కంచె గచ్చిబౌలిలో కంచే చేనుమేస్తే.. కాపాడేదెవరు?
మొన్న లగచర్ల.. నిన్న మూసీ.. ఇప్పుడు హెచ్‌సీయూ! భూములపై రేవంత్ ప్రభుత్వం మొదటినుంచీ దాగుడుమూతలు ఆడుతున్నది. నిజాలను దాస్తూ.. అబద్ధాలను వండివారుస్తున్నది. యూనివర్సిటీలో చెరువే లేదన్నరు. కానీ కళకళలాడుతున్న చెరువు కనిపిస్తున్నది. జంతుజాలం, అరుదైన వృక్షజాతులేవీ లేవన్నరు. కానీ, మందలుగా జింకలు కనిపిస్తున్నయ్. నెమళ్ల అరుపులు వినిపిస్తున్నయ్. యంత్రభూతం పదఘట్టన కింద పడి నలిగిన ఓ జింక కళేబరమూ బయటపడింది! ‘గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్’ను జేసీబీలు ఛిద్రం చేస్తుంటే.. పశుపక్ష్యాదులు ప్రాణభయంతో చేస్తున్న అరుపులతో పరిసరాలన్నీ దద్దరిల్లుతున్నయ్. విద్యార్థుల ప్రతిఘటన నినాదాలూ ప్రతిధ్వనిస్తున్నయ్.
ఆ అరణ్యరోదన వినపడనిది ఒక్క ప్రభుత్వానికే!
దేశ, విదేశాల విద్యార్థులు చదివే యూనివర్సిటీ క్యాంపస్‌ను పోలీస్ క్యాంప్‌ను చేసేసింది ప్రభుత్వం. విశ్వవిద్యాలయ పెద్దల అనుమతి లేకుండానే వందలాదిమంది ఖాకీలతో విద్యార్థులపై విరుచుకుపడుతున్నది. ప్రశ్నించిన వారిని అరెస్టు చేస్తున్నది. అడ్డుకునేవారిపై లాఠీలు ఝళిపిస్తున్నది.
రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నప్పుడు కాంగ్రెస్ యువనేత రాహుల్ వచ్చి తన రాజకీయ విమర్శలకు వేదికగా చేసుకున్నది ఈ హెచ్సీయూనే! ఇందిరమ్మ ఇచ్చిన భూముల్ని గుంజుకుని, అమ్ముకుంటానని తమ ప్రభుత్వమే చెప్తున్నా.. ఆ ఇందిర మనుమడు ఇదేందని అడగడం లేదు.
ముఖ్యమంత్రి చెప్పినట్టు అక్కడ గుంటనక్కలున్నయ్!
గుట్టలను మింగే గుంటనక్కలున్నయ్!
గుంట భూమినీ వదలని గుంటనక్కలున్నయ్!
ఆ గుట్టును ఇప్పుడు రట్టు చేస్తున్నరు విద్యార్థులు!
1969 తెలంగాణ ఉద్యమ ఫలితం.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. హెచ్‌సీయూకి ఇది స్వర్ణోత్సవ సంవత్సరం. బంగారుకాంతితో విశ్వవిద్యాలయం కొత్త వెలుగులు విరజిమ్మే వేళ.. ‘ప్రజాపాలన’ బుల్డోజర్లు ఆకుపచ్చని క్యాంపస్‌ను తూట్లుపొడుస్తున్నయ్! ఇది ధ్వంసరచన! ఇది విధ్వంస యోచన!
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 31(నమస్తే తెలంగాణ) : బుల్డజోర్ల హోరు.. విద్యార్థుల నిరసనల జోరుతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) అట్టుడుకుతున్నది. పదుల సంఖ్యలో జేసీబీలు, వందలాది మంది పోలీసుల బందోబస్తుతో హెచ్‌సీయూ పరిధిలోని 400 ఎకరాల భూమి నిండిపోయింది. ఇప్పటివరకు పచ్చగా కనిపించిన ఆ ప్రాంతం బుల్డోజర్ల చదునుతో ఎడారిలా మారుతున్నది. ఆదివారం అర్ధరాత్రి నుంచి యూనివర్సిటీలోని పచ్చని చెట్లను బుల్డోజర్లు కూకటివేళ్లతో పెకిలించి వేస్తున్నాయి. విలువైన ఔషధ మొక్కలు ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి. అరుదైన పక్షులు, జంతువులు బిక్కుబిక్కుమంటూ పరుగులు పెడుతూ హాహాకారాలు చేస్తున్నాయి.
ఆదివారం ఉదయం నుంచే హెచ్‌సీయూ యుద్ధవాతావరణాన్ని తలపిస్తున్నది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఉగాది రోజు 50 జేసీబీలను రంగంలోకి దింపింది. టీజీఐఐసీ ఆధ్వర్యంలో అధికారులు, పోలీసుల సమక్షంలో రాత్రింబవళ్లు అడవిని చదును చేస్తున్నారు. విద్యార్థులు, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో అడవిని చదును చేసేందుకు సర్కారు ఆగమేఘాలపై చర్యలు తీసుకుంటున్నది. సోమవారం రాత్రి మరో 400 జేసీబీలను టీజీఐఐసీ తీసుకొచ్చింది. అరుదైన జంతు, వృక్ష సంపద కలిగిన అందమైన ప్రాంతాన్ని నలువైపులా చుట్టుముడుతున్న జేసీబీలు అడవిని నామరూపాల్లేకుండా చేస్తున్నాయి. అడవిని మైదానంగా మార్చి, కార్పొరేట్లకు వేలంలో కట్టబెట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శిస్తున్నారని విద్యార్థి నేతలు మండిపడుతున్నారు.
పోలీసుల భారీ బందోబస్తు నడుమ టీజీఐఐసీ ఆధ్వర్యంలో హెచ్‌సీయూ పరిధిలోని భూముల్లో సోమవారం జేసీబీలతో చదును పనులు చేపట్టారు. బారికేడ్లను ఏర్పాటుచేసి పోలీసులు పహారా కాశారు. ఈస్ట్ క్యాంపస్ వైపునకు విద్యార్థులను అనుమతించకుండా పనులు చేపట్టారు. సాయంత్రం వరకు 60-70 ఎకరాల భూమిని పూర్తిగా చదును చేశారు. అటువైపు వచ్చిన వారిని అరెస్టు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. పోలీసుల తీరుకు ఆగ్రహించిన విద్యార్థులు ఆందోళనకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తూ మెయిన్ గేట్ ముందు నిరసనకు దిగారు. ప్రభుత్వం చదును పనులను నిలిపేసేవరకూ ఆందోళన విరమించబోమని భీష్మించుకు కూర్చున్నారు.
జేసీబీలతో చెట్లను నేలమట్టం చేస్తుండటంతో ‘గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్’గా పిలిచే ప్రాంతం కనుమరుగవుతున్నది. సోమవారం నాటికి సుమారు సగం భూమిలో చెట్లను తొలగించి భూమిని చదును చేశారు. దీంతో ఏండ్ల తరబడిగా నెలకొన్న జీవవైవిధ్యం కనుమరుగవుతున్నది. గ్రీనరీ తొలగింపుతో పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లనున్నట్టు పర్యావరణ వేత్తలు, మేధావులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
హెచ్‌సీయూ పరిరక్షణకు అంతా ఒక్కటిగా నడుంకట్టారు. సామాజిక మాధ్యమాల వేదికగా ‘సేవ్ హెచ్‌సీయూ బయోడైవర్సిటీ’ అంటూ నినదిస్తున్నారు. ఎక్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ తదితర వేదికల్లో యూనివర్సిటీ భూములను కాపాడాలంటూ రేవంత్‌రెడ్డి సర్కారుపై మండిపడుతున్నారు. మరోవైపు ఆ పోస్టులను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి ట్యాగ్ చేయడం గమనార్హ ం. ‘వేల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన, రూ.లక్షల కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వ భూమిని రేవంత్ సర్కార్ అమ్మకానికి పెట్టింది. భారత్ జోడో యాత్రలో యువతకు ఇచ్చిన హామీని మర్చిపోయారా రాహుల్‌గాంధీ? భూముల రక్షణ కోసం పోరాటం చేస్తున్న విద్యార్థులపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దారుణంగా లాఠీచార్జి చేసి అక్రమ అరెస్టులు చేసింది.
తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకోండి రాహుల్‌గాంధీ’ అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఎక్స్‌లో వీడియో పోస్టు చేశారు. ‘తెలంగాణ ప్రభుత్వం డజన్ల కొద్దీ బుల్డోజర్లతో హెచ్‌సీయూ భూముల్లో విధ్వంసం సృష్టిస్తున్నది. వెంటనే వాటిని ఆపాలి. ఈ పోరాటంలో తన మద్దతు హెచ్‌సీయూ విద్యార్థులకే’ అని ప్రముఖ పర్యావరణ ఉద్యమకారిణి లిసిప్రియా కంగుజమ్ పోస్టు చేశారు. ‘హెచ్‌సీయూ భూముల అమ్మకానికి వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన తెలిపితే వాళ్లను అరెస్టుచేయడం ఘోరం’ అని టాలీవుడ్ నటుడు ప్రియదర్శి ఇన్స్టాగ్రామ్ వేదికగా ఖండించారు. ‘పారిశ్రామిక ప్రాజెక్ట్ కోసం జీవవైవిధ్యం గల భూమిని కాపాడాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరితే, కోర్టు విచారణ పూర్తికాకముందే జేసీబీలతో విధ్వంసం చేస్తున్నారు ఎందుకు?’ అని ప్రముఖ పర్యావరణ పాత్రికేయురాలు బహర్దుత్ పోస్టు చేశారు.
‘హెచ్‌సీయూలో అభివృద్ధి చెందుతున్న వృక్ష, జంతుజాలాన్ని నాశనం చేస్తున్నారు. చూస్తేనే గుండె తరుక్కుపోతుంది. ఈ మట్టిలో 237 పక్షిజాతులు, మచ్చల జింకలు, పాములు ఉన్నాయి. ఇవన్నీ మన వారసత్వం, సంస్కృతికి చిహ్నాలు’ అని గుంజన్ పోస్ట్ చేశారు. ‘తెలంగాణ ప్రభుత్వం హెచ్‌సీయూలో చేస్తున్న జీవవైవిధ్య విధ్వంసంపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఎందుకు మౌనంగా ఉంది? సుమోటో కేసుతో చట్టపరమైన చర్యలు తీసుకోండి’ అని బీఆర్ఎస్ నేత శుభప్రద్ పటేల్ పోస్టు చేశారు. హెచ్‌సీయూ భూముల్లో రేవంత్ సర్కారు విధ్వంసాన్ని విద్యార్థి, యువజన సంఘాల నేతలు ఖండించారు.