మహిళ ఆత్మగౌరవాన్ని కాపాడాలన్న సోయి కూడా మరిచి కాంగ్రెస్ నేతలు దుశ్శాసనుల్లా ప్రవర్తించారు. ప్రజల మాన, ప్రాణాలను పరిరక్షించే కనీస బాధ్యతను గాలికి వదిలి ఓ ఆడబిడ్డ కన్నీళ్లకు కారకులయ్యారు. రోడ్డు విస్తరణ పేరిట బుల్డోజర్తో సాగించిన దౌర్జన్యకాండలో ఓ మహిళ బాత్రూంలో ఉండగానే ఇంటి గోడను కూల్చివేసి వీధి రౌడీల్లా వ్యవహరించారు. ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకొంటూనే సభ్య సమాజం సిగ్గుపడేలా చేసిన తప్పును అధికార మదంతో సమర్థించుకోవడం స్థానికుల్లో ఆగ్రహం తెప్పించింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి సొంత ఇలాకా.. నారాయణపేట జిల్లా కోస్గిలో శనివారం జరిగిన ఈ ఘటన మానవత్వానికే మాయని మచ్చగా నిలిచింది.
మహబూబ్నగర్, మే 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పేదల ఇండ్లపైకి కనికరం లేకుండా దూసుకొచ్చే బుల్డోజర్.. కుటుంబాలను కట్టుబట్టలతో రోడ్డుకీడ్చి వారి బతుకులను బజారున పడేయడంతో ఇల్లూవాకిలి కోల్పోయి వారు పడ్డ బాధ అంతాఇంతా కాదు. లగచర్ల, వెలుగుమట్ల, హైదరాబాద్లో మధుపార్క్ రిడ్జ్.. ఇలా అనేకచోట్ల ‘హైడ్రా’ బాధితులు అనుభవించిన ఆవేదన, ఆగమైన బతుకు తాలు కా దృశ్యాలు ఇంకా అందరి కండ్ల ముం దూ కదలాడుతూనే ఉండగా, తాజాగా అంతకుమించిన దారుణమైన, సభ్యసమా జం తలదించుకొనే సంఘటన ఒకటి వెలుగుచూసింది. కనీస సంస్కారం, ఇంగిత జ్ఞానం లేకుండా ఒక మహిళ స్నానం చే స్తుండగా బుల్డోజర్తో దూసుకొచ్చి ఇంటి ని కూల్చేయడం కలచివేసింది.
ఇప్పటివరకు చాలాచోట్ల ఇంట్లో వస్తువులు, బట్ట లు, అన్నింటినీ నడ్డిరోడ్డుపై పడేయగా.. అధికార కాంగ్రెస్ నేతలు ఇప్పుడొక ఆడబిడ్డ పరువును బజారున పడేలా చేశారు. ఈ సిగ్గుమాలిన చర్య సీఎం రేవంత్రెడ్డి ఇలాకా నారాయణపేట జిల్లా కోస్గిలో శనివారం జరుగగా, కాంగ్రెస్ నేతల దౌర్జన్యం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ‘ఇంట్లో ఉన్నా కూల్చేస్తాం’ అని రౌడీల మాదిరిగా ముందే బెదిరించి మరీ నేలమట్టం చేశారు. అధికారం అండతో అడ్డూఅదుపు లేకుండా రెచ్చిపోయి అరాచకాలు చేస్తున్న హస్తం నేతలు.. ఇప్పుడు ఆడబిడ్డల మానాన్నీ లెక్కచేయకపోవడంపై మహిళాలోకం కన్నెర్రజేస్తున్నది.
కూల్చివేత ఘటన కోస్గిలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రోడ్డు విస్తరణలో భాగం గా పట్టణంలోని శివాజీ చౌరస్తాలో కాంగ్రె స్ ప్రజాప్రతినిధులు, నాయకులు పలు ఇండ్లపైకి బుల్డోజర్లను పంపారు. ఆరేడు ఇండ్లు, దుకాణాలను కూలగొట్టారు. ఉద యం నిద్రలేవక ముందే బయట కూల్చివేతలు ప్రారంభించడంతో ఆందరిలో భ యాందోళన మొదలైంది. అక్కడికి వెళ్లి ప లువురు తమ వద్ద కోర్టు స్టే కాపీ ఉందని, కోర్టులో కేసు పెండింగ్లో ఉండగా ఎలా కూల్చుతారని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులుగా ఉండి.. రౌడీల్లాగా ప్రవర్తిస్తూ విచక్షణ కోల్పోయి ప్రవర్తించారు. అనంతరం అక్కడే ఉన్న చిరు వ్యాపారుల నిర్మాణాలను కూడా బుల్డోజర్లతో కూల్చివేశారు.
‘మా ఇల్లు కూల్చొద్దని ఎంత వేడుకన్నా నాయకులు, కౌన్సిలర్లు వినలేదు. మీరు ఇంట్లో ఉన్నా కూల్చేస్తామని బెదిరించారు. నేను బాత్రూంలో ఉండగానే గోడ కూల్చివేశారు’ అంటూ బాధిత మహిళ కన్నీటి పర్యంతమైంది. పోలీసులకు, మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా వారు అక్కడకు రాలేదని ఆవేదన వ్యక్తంచేసింది.
సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో రోడ్డు విస్తరణ పేరుతో కాంగ్రెస్ నేతలు అరాచకానికి దిగడంపై కోస్గి బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు.