కోల్సిటీ, డిసెంబర్ 21: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గణేశ్చౌక్లో చేపట్టిన ‘ఆపరేషన్ చౌరస్తా’ బాధితుల రోదనలతో హోరెత్తింది. ఆదివారం రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కట్టడాలు కూల్చివేయగా, ఆ ప్రాంతం నిరసనలతో అట్టుడికింది. సిరిశెట్టి జయసుధ లలిత-మల్లేశంకు చెందిన భవనం అర్ధరాత్రి దాటాక నేలమట్టమైంది. శనివారం అధికారులు కూల్చివేస్తుండగా బాధిత కుటుంబం అనుమతి పత్రాలు చూపించగా.. ముందు, వెనుకభాగం కూల్చివేసి వెళ్లిపోయారు. జయసుధ సైతం తన ఇద్దరు ఆడపిల్లలను తీసుకొని ఇంటికి వెళ్లిపోయింది. తెల్లవారి వచ్చిచూసేసరికి పూర్తిగా నేలమట్టమై ఉండటంతో ఆ కుటుంబం శిథిలాలపైనే కుప్పకూలింది.
‘ఇది ఊరా..? వల్లకాడా..? మేము మనుషుల మధ్య లేమా..? 15 లక్షలు పెట్టి మొన్ననే షాపు కట్టుకున్న, అందులో 20 లక్షల సామగ్రి ఉంది. ఇప్పుడు మా గతేం కావాలి’ అంటూ కన్నీరుపెట్టుకున్నది. బాధితులకు మద్దతుగా బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఆందోళనకు దిగగా.. న్యూ ఇండియా, జనసేనపార్టీల నాయకులు, సామాన్యులు, కూల్చివేతల బాధితులు కదిలివచ్చారు. మాజీ కార్పొరేటర్లు కౌశిక లత, లావణ్య బాధిత మహిళను ఓదార్చి ధైర్యం చెప్పారు.
చౌరస్తాలో సత్యాగ్రహ దీక్ష చేపట్టి రామగుండం ఎమ్మెల్యే వైఖరిని ఎండగట్టారు. బీఆర్ఎస్ నాయకుడు కౌశిక హరి మాట్లాడుతూ బాధితులకు ఎమ్మెల్యే వచ్చి నష్ట పరిహారం చెల్లించి ఇల్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యమని మాజీ కార్పొరేటర్ కౌశిక లత ప్రశ్నించారు. బీజేపీ నాయకులు రోజంతా సత్యాగ్రహ దీక్ష కొనసాగించారు. బాధిత మహిళకు షాపు నిర్మించేవరకు దీక్షను విరమించేది లేదని కొండపర్తి సంజీవ్ స్పష్టం చేశారు.