Build Now Portal | హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పాత విధానంలోనే అనుమతులు పొందాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కొత్త పోర్టల్ ఇంకా అందుబాటులోకి రాకపోవడమే ఇందుకు కారణం. జీహెచ్ఎంసీ పరిధిలో ఈ నెల 10 నుంచి ప్రయోగాత్మకంగా కొత్త విధానాన్ని అమలు చేయాల్సి ఉన్నప్పటికీ అందుకు సంబంధించిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. రియల్ ఎస్టేట్ అనుమతుల కోసం ఫిబ్రవరి 1 నుంచి ‘బిల్డ్ నౌ’ పేరుతో కొత్తగా సింగిల్ పోర్టల్ విధానాన్ని అందుబాటులోకి తెస్తామని మంత్రి శ్రీధర్‌బాబు 3 నెలల క్రితం ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, ఆ గడువు దాటి నెల రోజులు గడిచినా ‘బిల్డ్ నౌ’ పోర్టల్ అతీగతీ లేదు. దీంతో అనుమతుల కోసం రియల్టర్లు పాత విధానంలోనే దరఖాస్తు చేసుకుంటున్నారు.
‘బిల్డ్ నౌ’ సింగిల్ పోర్టల్‌తో పెద్దగా ఉపయోగమేమీ ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పోర్టల్‌లు ఎన్ని వచ్చినా అనుమతుల్లో జాప్యం జరుగుతూనే ఉంటుందని, కాంగ్రెస్ నాయకుల అండదండలున్నవారికే అనుమతులు వస్తాయని తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ (టీఆర్ఏ) నాయకులు చెప్తున్నారు.
వాస్తవానికి ‘బిల్డ్ నౌ’ పోర్టల్‌పై రియల్టర్లకు ఎలాంటి అవగాహన లేదు. వారితో ప్రభుత్వం ఒక్క సమావేశాన్ని కూడా నిర్వహించకపోవడంతో అనుమతుల కోసం ఆ పోర్టల్ ద్వారా ఎలా దరఖాస్తు చేయాలో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది. ‘బిల్ట్ నౌ’ పోర్టల్‌ను ప్రభుత్వం సక్రమంగా అమలు చేయాలనుకుంటే కేవలం 2-3 జిల్లాలకే పరిమితం చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని రియల్టర్లు డిమాండ్ చేస్తున్నారు.