హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న బీజేపీ నేతలపై టీఆర్ఎస్ నేతలు దేవీప్రసాద్, రమేశ్‌రెడ్డి, సోమ భరత్‌కుమార్ ఫిర్యాదు చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఈవో సత్యవాణిని నేతలు కోరారు. ఈ సందర్భంగా సోమ భరత్‌కుమార్ మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలో బండి సంజయ్ పచ్చి బూతులు మాట్లాడుతున్నాడని, ఆబండాలు వేయడం, వాళ్లకు వాళ్లే దేవుళ్లుగా చిత్రీకరించుకుంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘రూ.40వేలు తీసుకొని బీజేపీకి ఓటు వేయండి’ అని చెప్పడం కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకు వస్తుందని, దీనిపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
పార్లమెంట్ సభ్యుడై ఉండి.. బండి సంజయ్ మాట్లాడడం సరికాదన్నారు. సంజయ్ వ్యాఖ్యలు రాష్ట్రానికే కాదు దేశానికే మంచివి కావన్నారు. బీజేపీపై చర్యలు తీసుకోకపోతే.. ఆ పార్టీకి కొమ్ము కాసినట్లే అవుతుందని, ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ అని, దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు. గుర్తుల విషయంలో ఆ పార్టీకి లాభం చేకూరులే నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. స్వతంత్ర అభ్యర్థులకు కారును పోలిన గుర్తులను కేటాయించొద్దని కోరినప్పటికీ.. మళ్లీ కేటాయించారని ఆరోపించారు. ఎన్నికలు ముగిసిన అనంతరం గుర్తులపై పోరాటం చేస్తామన్నారు. దేవీప్రసాద్ మాట్లాడుతూ బీజేపీ ప్రజల్లో మద్దతు లేక ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని, ఓ వైపు దొంగ ఓట్లు సృష్టించి.. లబ్ధిపొందాలని చూస్తున్నారని విమర్శించారు. బీజేపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.