శేరిలింగంపల్లి, ఆగస్టు 20 : తమకు న్యాయం చేయాలని నెలరోజులుగా ఎండనకా వాననకా ఆందోళన చేపడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపులేదని బీటీఎన్జీవోలు ఆగ్రహం వ్యక్తంచేశారు. గచ్చిబౌలిలోని భాగ్యనగర్ టీఎన్జీవోల కార్యాలయం వద్ద పలువురు ఉద్యోగులు, పెన్షనర్లు రోజుకో తీరులో వినూత్నంగా చేపడుతున్న నిరసన కార్యక్రమాలు బుధవారం 36వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ.. గాంధేయమార్గంలో నిరసనలు చేపడుతున్నా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు.
ఎట్టిపరిస్థితుల్లో తమకు న్యాయం జరిగేవరకు పోరాటం ఆపేది లేదని తేల్చిచెప్పారు. బీటీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆందోళనలో బీటీఎన్జీవోస్ మ్యుచువల్ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షుడు రాజేశ్వర్‌రావు, సెక్రటరీ మల్లారెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, డైరెక్టర్లు ప్రభాకర్‌రెడ్డి, రషీదాబేగం, సంధ్య, నర్సింహరాజు, ఏక్నాథ్గౌడ్, నాయక్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.