వాజేడు, అక్టోబర్ 6 : ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల అటవీ ప్రాంతంలోని దూసపాటిలోద్ది (విఫాల్స్) జలపాతంలో మునిగి బీటెక్ విద్యార్థి మృతిచెందాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన బండారు అభినవ్ (19) స్నేహితులతో కలిసి శనివారం వాజేడు మండలానికి వచ్చారు. రాత్రి చీకుపల్లిలో బస చేశారు. ఆదివారం ఉదయం కొంగాల అడవిలోని దూసపాటిలోద్ది (విఫాల్స్) జలపాతం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో జలపాతం వద్ద ఉన్న నీటిలోకి దిగిన అభినవ్ ప్రమాదవశాత్తు నీట మునిగాడు. స్నేహితుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈతగాళ్ల సాయంతో అభినవ్ మృతదేహాన్ని బయటికి తీసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏటూరునాగారం వైద్యశాలకు తరలించారు.