హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కార్మికుల సంక్షేమ కార్యక్రమాలను ప్రైవేటు సంస్థకు కట్టబెట్టి కార్మికుల సొమ్మును కాజేసేందుకు ముఖ్యమంత్రి అనుచరుడు కుట్రపన్నారని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ ఆరోపించారు. రేవంత్‌రెడ్డి సర్కారు తీసుకున్న ఏకపక్ష నిర్ణయం కారణంగా కార్మికులకు 11 సంక్షేమ పథకాలు, బీమా అందకుండా పోతున్నాయని మండిపడ్డారు. తక్షణమే ఈ అంశంపై విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకోవాలని, లేనిపక్షంలో బీఆర్టీయూ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. తెలంగాణభవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భవన, ఇతర నిర్మాణ కార్మికులకు బీమా, పింఛను, ఆరోగ్య సంరక్షణ వంటి సామాజిక భద్రత పథకాలు, సంక్షేమ చర్యలు చేపట్టడానికి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటైందని చెప్పారు. ఈ బోర్డు కార్మికుల ప్రమాద బీమా, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించిందని తెలిపారు. కానీ, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కార్మికల బీమా వ్యవహారాలను ట్రేబ్లేజర్ అనే బ్రోకర్ కంపెనీకి రూ.346 కోట్లకు కట్టబెట్టిందని విమర్శించారు. బోర్డు చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించవద్దని కార్మిక సంఘాలు చేసిన ఆందోళనలు, వినతులను పట్టించుకోకుండా, ఏకపక్షంగా బీమా వ్యవహారాలను ప్రైవేటు కంపెనీకి అప్పగించారని మండిపడ్డారు. భవన నిర్మాణాల ద్వారా కార్మికుల సంక్షేమం కోసం ఒక శాతం సెస్ రూపంలో సమకూరే నిధులను కాజేయడానికి సీఎం అనుచరుడు కుట్ర చేశాడని ఆరోపించారు.
ఎన్నడూ రూ.346 కోట్లు కాలేదు..
తెలంగాణలో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటైన నాటి నుంచి ఎన్నడూ కూడా రూ.346 కోట్ల బీమా క్లెయిమ్‌లు కాలేదని, ఇది కార్మికుల సొమ్మును దుర్వినియోగం చేయడమేనని రాంబాబుయాదవ్ చెప్పారు. కార్మికుడు 122 రూపాయలు చెల్లించి బోర్డులో సభ్యుడిగా చేరితే ఆ సభ్యత్వం ఐదేండ్లపాటు ఉండేదని, కొత్త బ్రోకర్ సంస్థ నిబంధనల ప్రకారం దానిని ఏడాదికి తగ్గించారని తెలిపారు. దీంతో ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే కార్మికులకు బీమా సొమ్ము అందే పరిస్థితి ఉండదని ఆందోళన వ్యక్తంచేశారు. బోర్డు వద్ద 1.18 లక్షల కార్మికుల దరఖాస్తుల పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిష్కరించకుండానే బీమా వ్యవహారాలు ప్రైవేటు సంస్థకు అప్పగించారని విమర్శించారు. కొత్తగా తెచ్చిన బీమా వ్యవస్థను రద్దుచేసి, ఒక సంక్షేమ కార్యక్రమం కూడా రద్దు కాకుండా పాత పద్ధతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
పాలకుడే అవినీతిపరుడు: మారయ్య
పాలకుడే అవినీతిపరుడు అయినప్పుడు, అధికారులు కూడా అందినకాడికి దోచుకుంటున్నారని ఆటో, మోటార్ ట్రేడ్ యూనియర్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య ఆరోపించారు. రవాణాశాఖ కార్యాలయాలు, పోలీస్స్టేషన్లు అవినీతి, సెటిల్మెంట్లకు అడ్డగా మారాయని వ్యాఖ్యానించారు. కార్మికుల ప్రమాద బీమాను కేసీఆర్ సర్కారు రూ.6 లక్షలు పెంచారని, కాంగ్రెస్ సర్కారు హామీలు ఎగ్గొడుతున్నదని ఆరోపించారు.