BRSV | హైదరాబాద్ : గ్రూప్ -1 పరీక్ష నిర్వహణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఫలమైనందున నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని బీఆర్ఎస్వీ డిమాండ్ చేసింది. ఈ నెల 11వ తేదీన అన్ని యూనివర్సిటీలు, జిల్లా కేంద్రాలలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు.
గ్రూప్ -1 పోస్టుల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఎలాగైనా సరే గ్రూప్-1 పరీక్షలను పూర్తి చేయాలని పట్టుదలకుపోయిన కాంగ్రెస్ సర్కార్కు హైకోర్టు దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చింది. గ్రూప్-1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నిర్వహించిన మెయిన్స్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని తేల్చింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, అవకతవకలు జరిగాయని దాఖలైన పిటిషన్లపై హైకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.