హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) రాష్ట్రస్థాయి తెలంగాణ విద్యార్థి సదస్సు శనివారం ఉదయం 10 గంటలకు ఉప్పల్ నియోజకవర్గం, మల్లాపూర్‌లోని వీఎన్ఆర్ గార్డెన్లో నిర్వహించనున్నారు. కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు, మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డితోపాటు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు హరీశ్‌రావు ప్రారంభోపన్యాసం చేస్తారు. మధ్యాహ్న భోజనం విరామం అనంతరం ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రసంగిస్తారు. చివరగా విద్యార్థులకు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తారు. ఈ సందర్భంగా శుక్రవారం బీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర స్థాయి సదస్సు సభా స్థలాన్ని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్, డాక్టర్ గాదరి కిశోర్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి సందర్శించారు.