బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సతీశ్ ఫైర్
హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు, ప్రజాసమస్యలపై కాంగ్రెస్ సర్కారును నిలదీస్తున్నందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి కేసుల కుట్రకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీశ్ ఆదివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. రేవంత్ ఢిల్లీ పర్యటనలోనే ఫార్ములా ఈ రేస్ కేసుపై ప్లాన్ చేసినట్టు పేర్కొన్నారు. జాతీయ పార్టీలు కూడబలుక్కొని కుట్రలుచేస్తున్నా బీఆర్ఎస్ బెదరబోదని స్పష్టంచేశారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిస్తే, రేవంత్‌రెడ్డితో దశాబ్దకాలం వెనకి నెట్టబడిందని విమర్శించారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అన్నివర్గాలను మోసం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పాలన మరిచి కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్న రేవంత్‌రెడ్డికి ప్రజలు ఓటుతోనే బుద్ధి చెప్తారని హెచ్చరించారు.