హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): దళిత, గిరిజన విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నదని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీశ్ ఒక ప్రకటనలో మండిపడ్డారు. రాష్ట్రంలోని 230 పైచిలుకు ప్రైవేట్ పాఠశాలల్లో 26,000 మంది పేద దళిత, గిరిజన విద్యార్థులు బెస్ట్ అవైలబుల్ స్కీం కింద చదువుతున్నారని తెలిపారు. విద్యార్థులకు చదువుతోపాటు పుస్తకాలు, యూనిఫాం, భోజన వసతులను పాఠశాలల ఆయా యాజమన్యాలు కల్పిస్తున్నాయని తెలిపారు. ఆ సీం కింద రూ.170 కోట్ల బిల్లులను ప్రభుత్వం ఆయా పాఠశాలలకు ఇవ్వాల్సి ఉన్నదని పేర్కొన్నారు.
ఆ ఫీజులను గత రెండేండ్లుగా చెల్లించకపోవడంతో తమ పాఠశాలలు నడపలేమని స్కూళ్ల యాజమాన్యాలు చేతులెత్తెసే పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. బెస్ట్ అవైలబుల్ పాఠశాలలను మూసివేస్తే పేద దళిత, గిరిజన విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందని తెలిపారు. రేవంత్రెడ్డి సీఎం అయ్యాక ప్రభుత్వ బడులు, ప్రైవేట్ విద్యాసంస్థలు అధ్వానంగా మారాయని పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఈ బిల్లులు చెల్లించడం చేతగావడం లేదని తెలిపారు. పేద దళిత, గిరిజన విద్యార్థుల కోసం బెస్ట్ అవైలబుల్ స్కీ బిల్లులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.