హైదరాబాద్, ఏప్రిల్19 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన యువతను దగా చేస్తున్నదని, గత ప్రభుత్వం అమలు చేసిన ప్రతిష్ఠాత్మక పథకాలను నిర్వీర్యం చేస్తున్నదని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనునాయక్ మండిపడ్డారు. గిరిజన నిరుద్యోగులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు మాజీ సీఎం కేసీఆర్ నిరుడు సీఎంఎస్టీఈఐ, విదేశాల్లో ఉన్నత చదువుల కోసం ఓవర్సీస్ స్కీమ్‌ను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు.
ప్రభుత్వం ఆ పథకాల బకాయిలను విడుదల చేయకుండా నిర్వీర్యం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం మాసబ్ ట్యాంక్‌లోని సంక్షేమ భవన్‌ను లబ్ధిదారులు, గిరిజన సంఘం నాయకులతో కలిసి బీఆర్ఎస్వీ నేతలు ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం గిరిజన విద్యార్థులు, నిరుద్యోగులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో 2020లో సీఎంఎస్టీఈఐ (చీఫ్ మినిస్టర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంత్రాపెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్) పథకాన్ని అమలు చేశారని పేర్కొన్నారు.
రాత పరీక్ష ద్వారా గిరిజన యువతను ఎంపిక చేసి బెంగుళూరులోని ఇండియన్ స్కూల్ బిజినెస్ (ఐఎస్బీ)లో 6నెలలపాటు శిక్షణ అందించేవారని వివరించారు. ఆ తరువాత కంపెనీ ఏర్పాటుకు రూ.కోటి రుణ సదుపాయాన్ని కల్పించేవారని, ఆ ఈ కోటిలో రూ.50 లక్షలు బ్యాంకుల ద్వారా, మరో రూ.50 లక్షలు ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందించేదని తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం 2022- 23లో 200 మందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా తక్షణమే బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ముట్టడి విషయం తెలుసుకున్న పోలీసులు సంక్షేమ భవన్ చేరుకుని బీఆర్ఎస్వీ నేతలను అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు.