హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తేతెలంగాణ): ‘ఏం ఉద్ధరించారని సీఎం రేవంత్‌రెడ్డి బర్త్‌డే వేడుకలు గురుకులాల్లో అధికారికంగా నిర్వహించాలి? ఫుడ్ పాయిజన్‌తో వాంకిడి ఆశ్రమ పాఠశాల పిల్లలు దవాఖానల పాలైనా పట్టించుకోనందుకా? పాములు కరిచి స్టూ డెంట్స్ చనిపోతున్నా సమీక్ష చేయనందుకా?’ అంటూ బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ మండిపడ్డారు. రెసిడెన్షియల్ స్కూళ్లల్లో సీఎం జన్మదిన వేడుకలు నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పడం, విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన ఆయనకు నిబంధనలు తెలియకపోవడం వి డ్డూరంగా ఉన్నదని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు తుంగ బాలు, రఘురాంతో కలిసి శుక్రవారం తెలంగాణభవన్‌లో గెల్లు శ్రీనివాస్ మీ డియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రతిష్టాత్మకం గా ఏర్పాటు చేసిన గురుకులాలను నాశనం చే సేందుకే కాంగ్రెస్ కంకణం కట్టుకున్నదని విమర్శించారు.
కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేసేందుకు అనైతిక చర్యలకు దిగుతున్నదని దుయ్యబట్టారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పేరిట విద్యార్థులను విభజించేందుకు కుట్రలు చేస్తున్నదని తూర్పారబట్టారు. నాసిరకం సరుకులు పంపుతూ పేద పిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నదని విమర్శించారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే గురుకుల స్కూళ్లకు పర్మినెంట్ బిల్డింగ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో అన్ని స్కూళ్లకు వెళ్లి సమస్యలు తెలుసుకొని కేటీఆర్‌కు నివేదిస్తామని వెల్లడించారు. తుంగ బాలు మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి అవగాహనారాహిత్యంతో అన్ని వ్యవస్థలను కుప్పకూల్చుతున్నారని దుయ్యబట్టారు. సీఎం యాదగిరిగుట్ట పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. నల్లగొండ జిల్లా వెనుకబాటుకు కాంగ్రెస్సే కారణమని మండిపడ్డారు.