హైదరాబాద్‌సిటీ బ్యూరో, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లోని వేలాది ఎకరాల భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన హిల్ట్ పాలసీని తక్షణమే రద్దు చేయకుంటే తెలంగాణ ఉద్యమం తరహాలోనే మరో ఉద్యమం చేపడతామని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ హెచ్చరించారు. విద్యార్థి సంఘాలను ఏకం చేసి పెద్దఎత్తున ఉద్యమాలు చేపట్టి ప్రభుత్వానికి విద్యార్థుల సత్తా రుచి చూపిస్తామని చెప్పారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో వివిధ విద్యార్థి సంఘాలు, మేధావులు హిల్ట్ పాలసీని వ్యతిరేకిస్తూ శుక్రవారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ.. హిల్ట్ పేరిట రూ.5 లక్షల కోట్ల విలువైన భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి హైదరాబాద్‌ను లూటీ చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
హైదరాబాద్‌ను కాపాడుకునేందుకు అన్ని వర్గాలు ఏకమై ఆంధ్ర పెత్తందారులను తరిమికొడితే కాంగ్రెస్, బీజేపీ కలిసి ఉత్తరాది వాళ్ల చేతుల్లో పెట్టేందుకు కుట్రలు చేస్తున్నాయని ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ విమర్శించారు. రూ.5 లక్ష కోట్ల విలువైన భూములు ప్రైవేట్‌పరం కాబోతుంటే కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఎందుకు నోరు మెదపడంలేదని ప్రశ్నించారు. హిల్ట్ అవినీతిలో వారిద్దరి వాటా ఎంత? అని విమర్శించారు. బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ పోరాటం చేస్తుంటే, బీజేపీ, ఏబీవీపీ ఎందుకు బయటకు రావడం లేదని మండిపడ్డారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనపై విమర్శలు చేసిన మేధావులు కోదండరాం, హరగోపాల్, ఆకునూరి మురళి ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. హైదరాబాద్‌లో ఆంధ్ర మీడియా తిష్ట వేసి చంద్రబాబు, రేవంత్‌రెడ్డికి వంతపాడుతున్నాయని దుయ్యబట్టారు.
హిల్ట్ పాలసీ పేరిట రూ.5 లక్షల కోట్ల విలువైన భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతూ సీఎం రేవంత్‌రెడ్డి రియల్ఎస్టేట్ మాఫియాకు తెర తీశారని రాజకీయ విశ్లేషకుడు బండారి రామ్మోహన్రావు ఆరోపించారు. 30% చెలిస్తే పారిశ్రామికవేత్తలకు భూములను రెగ్యులరైజ్ చేస్తామనడం అతిపెద్ద మోసమని పేర్కొన్నారు. పరిశ్రమలను తరలిస్తే లక్షలాది మంది కార్మికుల పరిస్థితేమిటని ప్రశ్నించారు. హిల్ట్ పాలసీపై శ్వేతపత్రం విడుదల చేయకుంటే కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు.
హిల్ట్ పాలసీ రద్దు చేయాలని కోరుతూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హెచ్ఎండీఏ పరిధిలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని తీర్మానించారు. విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో టీజీఐఐసీ కార్యాలయం ముట్టడి చేపట్టాలని, తెలంగాణలోని మేధావులతో అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహించాలని తీర్మానించారు. సమావేశంలో ఎస్ఎఫ్ఐ కార్యదర్శి నాగరాజు, పీడీఎస్‌యూ ఉపాధ్యక్షుడు మంద నవీన్, పీడీఎస్‌యూ (జీ) కార్యదర్శి నాగేశ్వర్రావు, టీవీఎస్ నాయకుడు హరీశ్‌గౌడ్, డీబీఎస్ఏ దర్శన్, బంజారా విద్యార్థి సంఘం నాయకులు శ్రీనునాయక్, వెంకట్ బంజారా, టీఎస్‌యూ నేత నల్లగొండ అంజి, బీజీ విద్యార్థి సం ఘం నేత నిఖిల్, ఎస్ఎస్ఎఫ్ నేత చాగంటి రాజేశ్, ఏఎమ్ఎస్ఏ నేత నామా సైదులు, బీఆర్ఎస్వీ నాయకులు తొట్ల స్వామి, కడారి స్వామి, విజయ్, అనిల్, హరిబాబు, భాస్కర్, దశరథ్, జంగయ్య, నాగేంద్రబాబు, అవినాశ్ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కార్యాలయాన్ని రియల్ఎస్టేట్ ఆఫీస్‌గా మార్చుకుని రేవంత్‌రెడ్డి వ్యాపారం చేస్తున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బా లు విమర్శించారు. నగరంలో పేదలకు ఇండ్లు, స్కూళ్లు, దవఖానలు నిర్మించడానికి స్థలంలేదని చెప్తున్న ప్రభుత్వం.. 9,292 ఎకరాలను రియల్ఎస్టేట్ వ్యాపారులకు బహుమతిగా ఇవ్వడానికి సిద్ధమైందని దయ్యబట్టారు.