Gellu Srinivas Yadav | హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా తలపెట్టిన బనచర్లపై జంగ్ సైరన్ మోగించేందుకే బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నామని బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర సదస్సు ఈ నెల 26న ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్స్‌లో నిర్వహిస్తున్నాం. ఉదయం పది గంటలకు ఈ సదస్సు ప్రారంభమవుతుందని తెలిపారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఉదయం సెషన్లో పాల్గొంటారు. మధ్యాహ్నం జరిగే సెషన్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పాల్గొంటారు. సాయంత్రం సెషన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ముగింపు ఉపన్యాసం ఇస్తారని పేర్కొన్నారు.
బనకచర్లతో తెలంగాణకు జరిగే నష్టాన్ని మా విద్యార్థి నేతలు ప్రతీ కాలేజీకి తిరిగి వివరిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఐదు లక్షల కరపత్రాలు ముద్రించాం. విద్యార్థులను కలిసి తెలంగాణకు బనకచర్లతో జరుగుతున్న నష్టాన్ని కరపత్రాలతో వివరిస్తున్నాం. బనకచర్లపై జంగ్ సైరన్ మోగించేందుకు ఈ సదస్సును ఏర్పాటు చేస్తున్నామని గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.