కన్నాయిగూడెం/ భూపాలపల్లి రూరల్, జూలై 24 : బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుని తీరుతామని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ముసె రాము స్పష్టంచేశారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కళాశాలల్లో తెలంగాణ నీటి వనరులపై బీఆర్ఎస్వీ జిల్లా ఇన్చార్జి సెగ్గం దినేశ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యదర్శి ముసె రాము హాజరై విద్యార్థులకు కరపత్రాలు పంపిణీ చేసి మాట్లాడారు. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని, జలదోపిడీ గురించి వివరించారు.
కేంద్రంతో చీకటి ఒప్పందంలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు, సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు. జల దోపిడీని విరమించుకోని పక్షంలో కేసీఆర్ నేతృత్వంలో మరో ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. రానున్న తరాలకు గోదావరి జలాలను కాపాడుకోవడానికి విద్యార్థులంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. గోదావరిపై ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు జరిగే అన్యాయాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని బీఆర్ఎస్వీ జిల్లా నాయకుడు దుర్గం రాజ్‌కుమార్ అన్నారు.
ముప్పనపల్లిలోని కస్తూర్బాగాంధీ కళాశాలలో బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు జరిగే నష్టంపై వివరంగా తెలుపుతూ ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీటి దోపిడీపై తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేసి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకున్నట్టు గుర్తుచేశారు. పదేళ్లలో కేసీఆర్ ప్రగతిని సాధిస్తే, ఇప్పటి ప్రభుత్వం వాటిని కాలరాస్తూ ఏపీకి కట్టబెడుతున్నదని మండిపడ్డారు. నీటికోసం ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి బనకచర్లను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.