శామీర్పేట, డిసెంబర్ 12 : శామీర్పేట బీసీ గురుకుల విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని గురుకులం ఎదుట బీఆర్ఎస్వీ నాయకులు శుక్రవారం ధర్నా చేశారు. గురుకులంలో సమస్యలపై పోలీసులకు, అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం గురుకుల పరిశీలనకు వెళ్లింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి స్వయంగా పరిశీలించిన నేతలు అకడ నెలకొన్న దుర్భర పరిస్థితులను బయటపెట్టారు.
బీఆర్ఎస్వీ నేతల ఎదుట విద్యార్థులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమతోనే పారిశుధ్య పనులు, వంట పనులు చేయిస్తున్నారని, చెప్పిన పనులు చేయకుంటే రబ్బరు పైపులతో కొడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తరగతి గదుల పకనే మరుగుదొడ్లు కంపుకొడుతుండటంతో చదవలేక పోతున్నామని వాపోయారు. భోజనంలో రాళ్లు వస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని తెలిపారు.
బీసీ గురుకుల సొసైటీ జాయింట్ సెక్రటరీ మద్దిలేటి కూడా శామీర్పేట పోలీస్ స్టేషన్కు చేరుకొని విద్యార్థుల సమస్యలను తక్షణం పరిశీలించాలని కోరినా స్పందన లేకపోవడంతో గురుకులం ఎదుట బీఆర్ఎస్వీ నాయకులు ధర్నాకు దిగారు. విషయం తెలిసి పోలీసులు చేరుకొని ధర్నాను అడ్డుకొని బీఆర్ఎస్వీ నేతలను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై మాట్లాడినందుకు తమను అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు.