Gellu Srinivas Yadav | తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనలు అతిక్రమిస్తూ తరగతులు నిర్వహిస్తున్న కార్పొరేట్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు సెక్రటరీని కలిసి వినతిపత్రం అందజేశారు.
అనంతరం గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేట్ కాలేజీలకు కొమ్ము కాస్తూ పేద వర్గాల విద్యార్థులకు ఇంటర్ విద్యను దూరం చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ఇంటర్ కాలేజీలను కాంగ్రెస్ సర్కార్ నిర్వీర్యం చేస్తూ ఉత్తరాది కాలేజీలకు తొత్తుగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. కార్పొరేట్ కాలేజీలు వేసవిలో తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని అన్నారు. ఇంజనీరింగ్ కోర్స్ ఫీజును మించి ఇంటర్ విద్యకు లక్షలకు లక్షల రూపాయలను ఫీజుల పేరిట గుంజుతూ విద్యార్థుల రక్తం తాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కార్పొరేట్ కళాశాలల దోపిడీని ఆరికట్టి ఆయా కాలేజీలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్వీ పక్షాన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు, కడారి స్వామి యాదవ్, పాండు గౌడ్, జంగయ్య, చటారి దశరథ్, కాటం శివ, అశ్వంత్ కుమార్, రాజ్ కుమార్, విశాల్, శ్రీకాంత్ ముదిరాజ్, నాగేందర్ రావు, రాహుల్, రెహమత్, ప్రశాంత్, కిరణ్, సంపత్, సాయి, ఆఫ్రిద్ తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.