ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 23 (నమస్తే తెలంగాణ) : గోదావరి నీటిని కొల్లగొట్టేందుకు ఏపీ సర్కారు చేపట్టిన బనకచర్ల లింక్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ పోరాటాలకు బీఆర్ఎస్వీ నడుం బిగించింది. తెలంగాణను ఎడారిగా మార్చే బనకచర్లను అడ్డుకునేందుకు మరో ఉద్యమం చేస్తామని తేల్చిచెప్పింది. ఇందులో భాగంగా విద్యార్థులను చైతన్య పరిచేందుకు కళాశాలలు, యూనివర్సిటీల స్థాయిలో అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నది. బనకచర్లతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులతో ఓయూ ఆర్ట్స్ కళాశాలలోని న్యూ సెమినార్ హాల్లో బుధవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు విద్యార్థి నేతలు మాట్లాడుతూ ప్రాజెక్టు కట్టేందుకు ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వంతపాడుతున్నారని, ఇకనైనా ఈ కుట్రలను ఆపకుంటే సహించేది లేదని హెచ్చరించారు. తెలంగాణకు ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న ద్రోహాన్ని ఎండగడుతూ, రేవంత్, బాబు కలిసి చేస్తున్న కుట్రలపై ప్రజలను చైతన్యపరచాల్సిన అవసర ఉన్నదని అభిప్రాయపడ్డారు. బనకచర్లతో రాష్ర్టానికి జరిగే నష్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఇందుకు విద్యార్థులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బనకచర్లతో తెలంగాణ ఎడారిలా మారే ప్రమాదం ఉన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఏ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపిన కేంద్రంలోని బీజేపీ సర్కారు బండారాన్ని బట్టబయలు చేయాలని, గోదావరిలో తెలంగాణ జల హక్కులను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు.
కాంగ్రెస్, టీడీపీ, బీజేపీల చీకటి ఒప్పందాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎనిమిది మంది ఎంపీలు ఉన్నా బనకచర్లపై ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ఎవరూ స్పందించడం లేదని మండిపడ్డారు. త్వరలోనే ఆ పార్టీలకు ప్రజల చేతిలో చావుదెబ్బ తప్పదని హెచ్చరించారు.
ఎవరెన్ని కుట్రలు చేసినా బనకచర్లను అడ్డుకుని తీరుతామని స్పష్టంచేశారు. ఇప్పటికైనా ప్రాజెక్టును ఆపేందుకు రేవంత్ సర్కారు కృతనిశ్చయంతో కృషి చేయాలని హితవు పలికారు. లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. సదస్సులో బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీడీ అనిల్, నాయకులు పెద్దమ్మ రమేశ్, కొంపెల్లి నరేశ్, పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి సుమంత్, ఎస్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్, నిరుద్యోగ జేఏసీ నేత కాశీ, బీసీ విద్యార్థి సంఘం నాయకుడు చారి తదితరులు పాల్గొన్నారు.